పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్ఞానస్నానాన్ని పరిపూర్ణం జేసేది భద్రమైన అభ్యంగనం. దీనిద్వారా క్రీస్తు తరపున ప్రపంచానికి సాక్ష్యమిస్తాం. పైగా ఈ సంస్కారం దంపతులు వివాహజీవితానికి సాక్ష్యమిచ్చేలాగూడ చేస్తుంది. అనగా భార్యాభర్తలు పరస్పరానురాగంతో జీవిస్తూ, విడివడని తమ క్రైస్తవ ప్రేమనుగూర్చి లోకం యెదుట సాక్ష్యమిస్తారు. బిడ్డలను కనిపెంచుతూ సంతానం దాంపత్యజీవితధ్యేయమని యెలుగెత్తి చాటుతారు. స్వార్ధప్రేమతో, విడాకులతో, కుటుంబ నియంత్రణతో కలుషితమైపోయిన నేటి కుటుంబజీవితానికి క్రైస్తవ దంపతులిచ్చే ఈ సాక్ష్యం ఎంతైనా అవసరం.

ఆమీదట దివ్యసత్రసాదముంది. ఇది క్రీస్తు ప్రేమను ప్రసాదించే సంస్కారం. దీనివలన దంపతులు క్రీస్తు ప్రేమను పొందుతారు. పరస్పర ప్రేమను పెంపొందించు కుంటారు. ఈ ప్రేమద్వారా ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరిపట్ల ఒకరు విశ్వాసంతో ప్రవర్తిస్తారు. వివాహంనాడు ఒకరి యెదుట ఒకరు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. ఒకరి కష్టాల నొకరు సానుభూతితో అర్థంజేసికొని ఒకరినొకరు ఓర్పుతో భరిస్తూ వుంటారు. దేహంలో జీవశక్తి యేలాంటిదో కుటుంబంలో ప్రేమశక్తి అలాంటిది. జీవాన్ని గోల్పోయిన దేహం శిధిలమైపోతుంది. ప్రేమను గోల్పోయిన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబాలను నిలబెట్టేది దివ్యసత్రసాదం.

కట్టకడన పాపోచ్చారణముంది. ఇది నరుల తప్పిదాలను క్షమించి వాళ్ళ బలహీనతలనూ, లోపాలనూ చక్కదిద్దే సంస్కారం. దీనివలన దంపతులు స్వీయ పాపాలకు లోపాలకు ప్రభువునుండి క్షమాపణం పొందుతారు. పైగా, ప్రభు క్షమాపణను ఆదర్శంగా బెట్టుకొని ఒకరినొకరు క్షమించుకోవడంగూడ నేర్చుకుంటారు. ఒకరి బలహీనతల నొకరు జాలితో చక్కదిద్దుకోవడానికి అలవాటు పడతారు.

ఇక, పాపోచ్చారణం లాంటిదే ఆత్మశోధనం గూడ. దంపతులు చేసుకునే ఆత్మశోధనం వాళ్ళ అంతస్తునకు తగినట్లుగా వుండాలి, అనగా భార్యాభర్తలు తమ పరస్పర ప్రేమనుగూర్చి, తాము బిడ్డలను పెంచే విధానాన్ని గూర్చి కుటుంబ జీవితం ద్వారాలోకానికి తామిచ్చే సాక్ష్యాన్ని గూర్చి ఆత్మశోధనం చేసుకోవాలి. ఈ యాత్మశోధనను గ్రంథాంతంలో పొందుపరచాం గనుక దాన్ని వాడుకోవచ్చు.

కుటుంబజీవితం జీవించేవాళ్లు ఈ క్రైస్తవ సంస్కారాలపట్ల ఆదరాన్ని భక్తిని చూపుతూండాలి. వాటిని యోగ్యంగా పొందుతూండాలి. అలా పొందినట్లయితే కుటుంబ ప్రజలు ప్రభు దీవెనలు బడసి ప్రశాంతంగా జీవిస్తారు. పుణ్యమార్గంలో సాగిపోతారు.