పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధనం బహుముఖంగా ఉంటుంది. కనుక కుటుంబప్రార్థన పలానా విధంగా ఉండాలి అని ఓ నియమాన్ని సూచించలేం. ఐనా మన క్యాతలిక్ క్రైస్తవులకు బైబులుతో అట్టే పరిచయం ఉండదు గనుక మన ప్రజలు బైబులు చదువుకొని ప్రార్థన చేసికోవడం చాల ముఖ్యం. మనం ప్రార్థించేప్పుడు దేవునితో సంభాషిస్తాం. కాని బైబులు చదువుకునేప్పడు ప్రభువే మనతో సంభాషిస్తాడు. జీవితంలో ఈ రెండు రకాల సంభాషణలూ అవసరమే. బైబులు చదువుకోవడంకూడ ఓ ప్రార్థన. బైబులు వాక్యాలద్వారా ప్రభువు మనతో మాటలాడతాడు అనే సత్యాన్ని మనవాళ్ళు చాలమంది గుర్తించరు. స్తిమితంగా కూర్చుండి రోజూ కాసేపు బైబులు చదువుకొని ప్రార్ధనం చేసికోవాలి. ఈ ప్రార్ధనం మనవి, విజ్ఞాపనం, కృతజ్ఞత, పశ్చాత్తాపం, ఆరాధన అనే నానారూపాల్లో వుండవచ్చు. ప్రార్థనలో వేదవాక్యం నోటికి రుచి తగలాలి. ఒకసారి వేదవాక్యాన్ని రుచిచూచిన భక్తులు ఇక దాన్ని వదలి ఉండలేరు.

ఈ లోకయాత్రలో ప్రభువు వాక్యమే దీపమై మనకు దారి చూపిస్తుంది. మనం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేలా, దేవుని మార్గాల్లో నడిచేలా చేస్తుంది.

మంచి ప్రార్ధనవల్ల మన జీవితం మంచికి మారుతుంది. మన పొరపాట్లను కొంతవరకైనా సవరించుకొంటాం. మనలోని స్వార్థం తగ్గుతుంది. తోడివారిని ప్రేమభావంతో ఆదరిస్తాం. ఇవన్నీ మన ప్రార్ధనం ఫలించిందనడానికి గుర్తులు.

గృహస్థులకు తరచుగా పగటిపూట కాలవ్యవధి లభించదు. కనుక కుటుంబమంతాకూడి రాత్రిపూట ప్రశాంతంగా అవధానంగా జపంచేసికోవడం మంచిది. ఎవరి ప్రార్ధనా కాలాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం ఉత్తమం.

3. క్రైస్తవ సంస్కారాలు

కుటుంబ జీవితాన్ని పవిత్రంజేసే సాధనాలన్నిటిలోను క్రైస్తవ సంస్కారాలు ప్రధానమైనవి. మొట్టమొదట వివాహజీవితం జీవించేవాళ్ళను జ్ఞానవివాహ సంస్కారం పునీతులను జేస్తుంది. ఈ సంస్కారంవలన క్రీస్తు-స్త్రీసభల ప్రేమ భార్యాభర్తల ప్రేమపైసోకి ఆ ప్రేమను నిర్మలం చేస్తుంది. ఈ సంస్కారం ఇచ్చే ప్రత్యేక వరప్రసాదం కస్టసుఖాల్లోను దంపతులను ఆదరిస్తుంది.

ఇక జ్ఞానస్నాన సంస్కారం వుంది. ఇది మనలను క్రీస్తుతో ఐక్యంజేస్తుంది. శ్రీసభ సభ్యులనుగా తయారుచేస్తుంది. ఈ శ్రీసభలో ఆరాధన జీవితమూ ప్రేమ జీవితమూ ప్రధానమైనవి. కనుక జ్ఞానస్నానం శ్రీసభలో ఓ భాగమైన క్రైస్తవ కుటుంబంకూడ ఈ యారాధన జీవితాన్ని సంపూర్ణంగా జీవించేలా జేస్తుంది.