పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేరణంతో ప్రారంభమగునుగాక, మీ సహాయంతో కొనసాగును గాక, మీయందే ముగింప జెందునుగాక"

ఇంకొక్క విషయాన్ని మాత్రం చెప్పి ఈ యధ్యాయాన్ని ముగిద్దాం. భగవంతుడు మనలను ఏ యంతస్తుకు పిలిచాడో ఆ యంతస్తునకు చెందిన బాధ్యతలను నిర్వహించే వరప్రసాదం కూడ ఇస్తాడు. ఆందుకే అగస్టీను "దేవుడు మనలను అసాధ్యమైన పనులు చేయమని అజ్ఞాపింపడు. కనుక ఆయా బాధ్యతలు మన పాల బడినపుడు, శక్తిగల యంతవరకు మన మా బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. శక్తి చాలనియపుడు భగవంతుని సహాయం అడుగుకోవాలి. భగవంతుడు మన మనవులను ఆలించి ఆ బాధ్యతలను నిర్వహించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు" అని బోధించాడు. అతడే మరో తావులో "ప్రభూ! మొదట నీ వాజ్ఞాపించే కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించు. ఆ మీదట నీ యిష్టం వచ్చిన కార్యాన్ని ఆజ్ఞాపించు, చేస్తాను" అని వాకొన్నాడు. సంసార జీవితంలో దైనందిన కార్యాలతో విసిగి వేసారిపోయే ప్రజలు ఈ వాక్యాలను స్మరించుకోవడం మేలు.

ప్రార్ధనా భావాలు

1. ఓరిజిన్ వేదశాస్త్రి యిలా వాకొన్నాడు. "నీవు వూపిరిపోసినట్లయితే ప్రాణి సృష్టి జరుగుతుంది. నీవు భూమికి నూత్నజీవాన్ని దయచేస్తావు" అంటుంది కీర్తన 104, 30. ఈ వూపిరి పవిత్రాత్కే ఆ యాత్మ నరుల హృదయాల్లోనికి ప్రవేశించి వాళ్లల్లోని ప్రాతమానవుని నాశం చేస్తుంది. అతని స్థానే నూత్నమానవుని ఆవిర్భవింపజేస్తుంది." ఈ నూత్న మానవుడే వరప్రసాద మానవుడు.
2. సొలోమోను దేవాలయాన్ని నిర్మించడానికి లక్షలాది కూలీలు పని చేసారు. ఆ దేవాలయాన్ని పూర్తిచేయడానికి ఏడేండ్లు పట్టింది -1 రాజు 9, 38. కాని బాబిలోనియా రాజు కేవలం 3,300 మంది సైనికులతో వచ్చి ఒక్కరోజులోనే ఆ మందిరాన్నిధ్వంసం చేసాడు. వరప్రసాదంతో మన హృదయమనే దేవాలయాన్ని నిర్మించుకోవడానికి చాల యేండ్లు పడుతుంది. కాని పాపంతో దాన్ని ధ్వంసం చేసికోవడానికి మాత్రం ఒక్క నిమిషమే చాలు.
3. జీవితంలో కష్టాలు వొస్తూంటాయి. మనం వాటిని తొలగించమని దేవుణ్ణి అడుగుకొంటాం, కాని ప్రభువు తరచుగా ఆ కష్టాలను తొలగించడు. వాటిని భరించే శక్తిని మాత్రం దయచేస్తూంటాడు. పౌలు తన బాధను తొలగించమని ఆడగ్గా ప్రభువు "నా కృప నీకు చాలు. నరుల బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమౌతుంది" అని చెప్పాడు-2 కొ 12-9. కనుక వరప్రసాద బలంతో మన పాలబడే కష్టాలను భరించాలి.