పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దేశం. కనుక ఈ వాక్యంలోని "వ్యభిచారం" మామూలు వ్యభిచారంకాదు. దగ్గరి బంధువులు చేసికొన్న నిషిద్ధవివాహం, అంతే. ఐనా ప్రోటస్టెంటు శాఖలు ఈ వాక్యాన్ని ఆధారంగా తీసికొని విడాకులను అనుమతించాయి. “దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపర్చరాదు" అన్న క్రీస్తు సూక్తికి అపవాదం లేదు. అది నూటికి నూరుపాళ్ళ చెల్లే సూత్రం. కనుక ఏలాంటి పరిస్థితుల్లోను విడాకులు పొసగవు.

3. వివాహబంధం

వివాహబంధం పెండ్లినాడు ప్రారంభమై భార్యాభర్తలు జీవించినంతకాలం కొనసాగుతుంది. అది కొనసాగినంతకాలం భార్యాభర్తలకు వరప్రసాదాన్ని ఇస్తూనే వుంటుంది. ఐనా వివాహ దేవద్రవ్యానుమానానికి గురుపట్టం జ్ఞానస్నానం మొదలైన వాటికిలాగ అక్షయమైన ముద్ర ఏమీలేదు. భార్యాభర్తల్లో ఒకరు గతించగానే వివాహబంధం విడివడిపోతుంది.

వివాహబంధంవల్ల దంపతులు తిరుసభకు చెందినవాళ్ళవుతారు. దేవుని పోలిక కలిగిన బిడ్డలను కని జ్ఞానశరీరాన్ని వృద్ధిచేస్తారు. ఇందుకు కావలసిన వరప్రసాదాన్ని వివాహబంధమే వాళ్ళకు దయచేస్తుంది.

దంపతుల్లో ఒకరు చనిపోగానే వివాహబంధం విడిపోతుంది. బ్రతికివున్న వ్యక్తి చనిపోయిన వ్యక్తిని ప్రేమతో స్మరించుకోవచ్చు. కాని అది వివాహబంధం మాత్రంకాదు. కనుక ఆ వ్యక్తి మళ్ళా పెండ్లిచేసికోవచ్చు.

ప్రార్థనా భావాలు

1. హిలెల్, షమ్మయి బోధలు

క్రీస్తు నాడు విడాకులనుగూర్చి యూదుల్లో రెండుభావాలుండేవి. హిలెల్ అనే రబ్బయి చిన్న అపరాధానికి భర్త భార్యకు విడాకులీయవచ్చునని బోధించాడు. అనగా భర్త తేలికగా భార్యను విడనాడవచ్చు. దీనికి భిన్నంగా షమ్మయి అనే రబ్బయి తీవ్రమైన అపరాధానికిమాత్రమే భర్త భార్యకు విడాకులీయవచ్చునని చెప్పాడు. అనగా భర్త భార్యను తేలికగా విడనాడకూడదు. కాని క్రీస్తు ఈ యిద్దరు రబ్బయిల భావాలనుకూడ కాదని అసలు విడాకులే పనికిరావని బోధించాడు. సృష్ట్యాదిలోని ఆదామేవల్లాగ భార్యాభర్తలు ఏకశరీరులై యుండాలనీ, దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరపరాదనీ నుడివాడు. భార్యను విడనాడి మరొకతెను వివాహమాడే పురుషుడు ఆ నూత్న స్త్రీతో వ్యభిచరించినట్లేనని పల్కాడు - మత్త 19,3-8.