పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిలబెట్టేదీకూడ దేవుని వరప్రసాదమే. హీబ్రూ భాషలో వరప్రసాదానికి "హెన్" అని పేరు. దేవుని అనుగ్రహానికి పాత్రులం కావడమని ఈ మాటకర్థం. ఇంకా ఈ పదానికి దేవుని దయ, ప్రేమ అనికూడ అర్థం చెప్పవచ్చు. అతనికి ప్రీతిపాత్రులమౌతామని భావం. ఈలాంటి వరాన్ని మనకు దయచేసినందుకుగాను మనం ఆ ప్రభువుకి నిరంతరం వందనాలు చెప్పాలి.

4. అంతర్నివాసం

నరులకు దేవుడొసగే దానం ప్రాకృతిక జీవం. దీనితోపాటు ఆధ్యాత్మిక జీవంకూడ వుంది. ఇదే దివ్యజీవితం, కాని ఈ దివ్యజీవంలో భగవంతుడు తన దానాలను గాదు, తన్నుతానే మనకు అనుగ్రహించుకొంటాడు. అనగా తాను మన హృదయంలో వసిస్తూంటాడు. ఇదే అంతర్నివాసం. కనుక ఈ యధ్యాయంలో ముగ్గురు దైవవ్యక్తులు మన హృదయంలో ఎలా వసిస్తూంటారో చూద్దాం. ఇక్కడ విశేషంగా నూత్న వేదంనుండి పౌలు యోహాను భావాలను తిలకిద్దాం. అంతర్నివాసాన్నే దైవాత్మక వరప్రసాదమనికూడ పిలుస్తారు.

1. క్రీస్తు అంతర్నివాసం

వార్త దేహాన్ని చేకొని మన మధ్యలో వసించింది అంటాడు యోహాను - 1,14, ఈ వార్త కలకాలం నుండి దేవుని యందు దేవునితో వసించే దివ్యవ్యక్తి ఐనా మన మానుషదేహం చేకొని మనజాతి నరుడై, మన మధ్యలో మరియమాత గర్భం నుండి జన్మించాడు ప్రభువు. జగత్ సృష్టిలో ఇంతకు మించిన గొప్ప వదంతం లేదు.

ఈ దివ్యవ్యక్తి తన కృపనూ సత్యాన్ని అనుగ్రహించడానికే మన చెంతకు వచ్చాడు 1,16. ఆ ప్రభువు మనలో వసిస్తుంటాడు. కావుననే అతడు నా యాజ్ఞలను పాటించే వాడు నన్ను పేమిస్తాడు. అతన్ని నేనూ నాపితా పేమిస్తాం. నేను అతనికి కానిపించుకుంటాను" అన్నాడు -14,21. ఇక్కడ కాన్పించుకోవడమనగా క్రీస్తు తన్ను ప్రేమించేవారిలో వసించడం, వసించి వారిలో తన ప్రభావాన్ని చూపెట్టడం.

క్రీస్తు మనయందు వసించడం మాత్రమే గాదు, మనమూ ఆ క్రీస్తునందు వసిస్తాం. ఈ యంతర్నివాసం పిత క్రీస్తునందూ క్రీస్తు పితయందూ వసించడంతో పోల్చబడింది - 6,57.

ద్రాక్షలత ఉపమానం మనకు తెలుసు. క్రీస్తు లత, మనం రెమ్మలం. అనగా మనం క్రీస్తున కదుకుకొని క్రీస్తునందు నెలకొని క్రీస్తునందు కొమ్మలు సాగాలి. క్రీస్తు