పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడ మనయందు నెలకొని తనసారమనే వరప్రసాదాన్ని మనలోనికి ప్రవేశపెడతాడు. కనుకనే “నేను మీ యందులాగే మీరు నా యందు నెలకొని వుండండని ఆదేశించాడు ప్రభువు - 15, 4 ఈ వాక్యం ప్రత్యక్షంగా నాటి ప్రేషితులకే అన్వయించినా, పరోక్షంగా విశ్వాసులందరికీ అన్వయిస్తుంది.

యోహాను లాగే పౌలు కూడ క్రీస్తు అంతర్నివాసాన్ని చాల తావుల్లో వర్ణించాడు. జ్ఞానస్నానం వలన క్రీస్తు మనమూ ఒక్క జ్ఞానదేహ మౌతాం. ఈ దేహానికి శిరస్సు క్రీస్తు మనం అవయవాలం. అనగా మనం క్రీస్తునందూ, మనయందు క్రీస్తూ వసిస్తుంటాడు1 12, 27.

రోమీయులు 6,5 లో పౌలు మనం క్రీస్తు మరణంతో ఐక్యమైతే అతనిని ఉత్తానంతో గూడ ఐక్యమౌతాం అంటాడు. కాని ఇక్కడ "ఐక్యంగావడం" అనే మాటకు పౌలు మూల భాషలో వాడిన శబ్దానికి "పిండం మాతృగర్భంలోలాగ మనమూ క్రీస్తునందు జీవిస్తుంటాం" అనే భావం స్ఫురిస్తుంది. అనగా పిండం మాతృప్రాణమునందు వలె మనమూ క్రీస్తు ప్రాణంలో పాలుపొందుతూంటాం. క్రీస్తుతో మనం ఇంత సన్నిహితంగా జీవిస్తాం. అందుకే పౌలు "నేను గాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అని చెప్పకున్నాడు - గల 2, 20. ఇది మహావాక్యం.

క్రీస్తుతో మనమూ మనతో ఆ క్రీసూ ఐక్యంగావడం ద్వారా ఆ ప్రభు భాగ్యాలు మనకు లభిస్తుంటాయి. మనం అతని బాధలు అనుభవిస్తాం - 2 కొ 1,5. దీని ఫలితంగా అతని ఉత్థానంలో పౌలు పొందుతాం - కొలో 3,12. క్రీస్తుతో శాశ్వత రాజ్యపాలనం చేస్తాం - 2 తిమో 2,12. నేడుకూడ క్రీస్తుమనస్సు శక్తి మనయందు పనిచేస్తుంటుంది - 1కొ 2,16, సంగ్రహంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక సౌభాగ్యాలన్నీ మనకు క్రీస్తుద్వారా లభిస్తాయి. ఆ క్రీస్తు ద్వారా సర్వసంపూర్ణత్వాన్ని పొందుతూంటాం - ఎఫే 3,19.

2. పిత అంతర్నివాసం

పితకూ సుతునికీ ఎడబాటు లేదు. కావున సుతుడు వసించే చోట పితగూడ వసిస్తుంటాడు. అందుకే క్రీస్తు"నన్ను ప్రేమించేవాళ్లు నా యాజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తారు. నా పిత వాళ్ళను ప్రేమిస్తాడు. మేమిద్దరమూ వాళ్ల చెంతకువచ్చి వాళ్ళయందు నివాస మేర్పరచుకుంటాం" అన్నాడు " యోహా 14,23. కనుక క్రీస్తులాగే పిత కూడ మనయందు వసిస్తుంటాడు.

పిత మనలను గాఢంగా ప్రేమించి, మన విమోచనకై తన యేకైక కుమారుని పంపాడు. ఈ సుతుడు నరులందరికీ పితతో పునస్సఖ్యాన్ని చేకూర్చాడు. ఇకమీదట నరులందరు దైవ ప్రేమతో, సోదర ప్రేమతో జీవించాలి. సోదర ప్రేమ ద్వారాకూడ పిత మనయందు వసిస్తుంటాడు. మనం ఒకరినొకరం ప్రేమిస్తే పిత మనయందు వసిస్తాడు =1 యోహాన్ 4, 12.