పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్తున్నారు. ప్రభువు తన్నెరుగనని బొంకి ధీమాగా కూర్చొని ఉన్న పేత్రువైపు అలా తేరిపారజూచాడు. అంతకుముందే ప్రభువు పేత్రుతో "ఈ దినం నీవు నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు" అని చెప్పాడు. పేత్రుకి దిఢీలున ఆ విషయం గుర్తుకి వచ్చింది. ప్రభువు చూపు అతనిలో పశ్చాత్తాపం పట్టించింది. అతడు గురువుని ఎరుగనని బొంకాను గదా అని వెలుపలకిబోయి విచారంతో వెక్కివెక్కియేడ్చాడు - లూకా 22, 62.

5. ఓమారు ఓ పరిసయుడూ ఓ సుంకరీ ప్రార్థన జేసికోవడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు దేవుని ముందు తన్నుతాను పొగిడేసుకొన్నాడు. తాను మంచి వాణ్ణేననుకొని తనలోతాను సంబరాలు పడ్డాడు. కాని సుంకరి చిత్తశుద్ధితో "ప్రభో! నేను పాపిని. నన్ను కరుణించు" అని మనవిచేసాడు. దేవుడు సుంకరి మొర ఆలించాడు, పరిసయుణ్ణి త్రోసిపుచ్చాడు - లూకా 18, 13.

6. క్రీస్తుతోపాటు ఇద్దరు దొంగలనుకూడ సిలువమీద కొట్టిచంపారు. వాళ్లల్లో ఒకడు పశ్చాత్తాపపడకుండానే మరణించాడు. పైగా అతడు "నీవే క్రీస్తువైతే మొదట నిన్ను నీవు రక్షించుకో, అటుపిమ్మట మమ్ముగూడ రక్షించు" అని సవాలు చేసాడు. కాని రెండవ దొంగ పశ్చాత్తాపపడ్డాడు. అతడు మొదట తన తోడి దొంగను మందలించాడు. మన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తూగూడ ఈ వెర్రివాగుడేమిటి అని అతని నోరు మూయించాడు. అటుతరువాత ప్రభువుతో "అయ్యా! నీవు తప్పకుండా మోక్షరాజ్యానికి వెళ్తావు. అక్కడికి చేరాక నన్నుకూడ జ్ఞాపకముంచుకో" అని మనవి చేసాడు - లూకా 23, 39-43.

7. దుడుకుచిన్నవాడు తండ్రి ఆస్తిలో తన వాటా తీసికొని దూరదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ దూబరా ఖర్చులతో సొత్తంతా పాడుచేసికొన్నాడు. ఆ దేశంలో పెద్ద కరువు రాగా తినడానికి తిండిలేక మలమలమాడి చచ్చాడు. అప్పడు అతనికి బుద్ధివచ్చింది. ఇంటివద్ద తన్ను ప్రేమతో చూచుకొనే నాన్నను వీడి వచ్చినందుకు పశ్చాత్తాపం పట్టుక వచ్చింది. అతడు “నేను మా నాన్నదగ్గిరికి వెళ్లి మన్నింపు అడుగుకొంటాను. ఇక మీదట నేను నీ కుమారుడ్డి అన్పించుకోవడానికి తగను. నన్నునీ సేవకుల్లో ఒకణ్ణిగానైన చేర్చుకో. ఏదో కమికెడు కూడు తిని బ్రతికిపోతాను అని చెప్తాను" అనుకొన్నాడు. పాపమంటే యీ దుడుకు చిన్నవాడిలాగ తండ్రియైన దేవునివద్దనుండి వెళ్ళిపోవడం. సృష్టికర్తను వీడి సృష్టి వస్తువులేమో మనలను సుఖపెడతాయనుకొని వాటి దగ్గరికి వెళ్లిపోవడం. పశ్చాత్తాపమంటే ఆ దుడుకుచిన్నవాడిలాగే మరల తండ్రియైన దేవుని యింటికి తిరిగిరావడం. ఆ తండ్రి యనురాగాన్ని పొందడం - లూకా 15, 17-19.