పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7.తొలినాటి తిరుసభలో అందరు క్రీస్తుని ప్రకటించారు. లోకం క్రీస్త విలువలను గ్రహించేలా చేసారు. కాని మధ్యయుగాల్లో సువిశేషబోధ గురువులపని అనుకొన్నారు. గృహస్తులు పూర్తిగా లౌకిక విషయాల్లో పడిపోయారు. వాటికన్ సభ సువిశేషబోధ అందరిపని అని, ఎవరి పద్ధతిలో వాళ్ళు క్రీస్తుని ప్రనకటించాలనీ చెప్పింది. ఇంకా ఇండియాలాంటి మిషనరీ దేశాల్లో ప్రజలు తీసుకోవడమే ముఖ్యమనీ, ఈయడం తమ పూచీకాదనీ భావిస్తున్నారు. వీళ్ళ మేము తిరుసభ నీడలో వుంటాం. అది పెద్ద సాంఘిక సంక్షేమసంస్థ. మేము దాని సాయంతో వృద్ధిలోకి వస్తాం. దానికి మాత్రం సాయం చేయం అనుకొంటారు. తీసుకోవడమేగాని, ఈయడం మాపనికాదు అన్నట్లుగా ఆలోచిస్తుంటారు. కాని ఇవి తప్పడు భావాలు. తిరుసభ మనకు ఈయగలిగినప్పడు తీసుకోవచ్చు. దాని సాయంతో వృద్ధిలోకి రావచ్చు. కాని మనతరపున మనంకూడ తిరుసభకు ఈయాలి. మన సేవలు దానికి అవసరం, గురువులతోకూడ గృహస్తులు కూడ వాక్యసేవకు పూనుకోవాలి. తిరుసభ చేయూతతో పైకి వచ్చినవాళ్ళంతా తమకంటె క్రింది దశలో వున్నవాళ్ళకు సహాయం చేయాలి. క్రీస్తు ప్రేమకూ కరుణకూ సాక్ష్యంగా వుండాలి.

ఈ మూడవ వేయి సంవత్సరాల కాలంలో పవిత్రాత్మ తిరుసభను ఆధునిక ప్రపంచంలోకి పంపుతూంది. పోయిన రెండువేల యేండ్లల్లో తిరుసభ సాధించిన విజయాలూ పుణ్యకార్యాలూ చాలావున్నాయి. కాని మనం ఇంకా ముందుకుపోయి ఇంకా పవిత్రకార్యాలూ ఎన్నో సాధించాలి. మనకు రెండువేల సంవత్సరాల అనుభవముంది. పూర్వులు చూపిన బాటలున్నాయి. వాటిల్లో నడపవచ్చు. కాని మనం ఇప్పడు క్రొత్తదారులు కూడ త్రోక్కాలి. ఆత్మశక్తితో, ఉత్సాహంతో లోకానికి సేవలు చేయాలి. ఇది తండ్రి ప్రేమించిన లోకం. క్రీస్తు ప్రవేశించిన లోకం. మన చేయూతను కోరే లోకం. ఆత్మ సహాయంతో, ప్రేరణతో మనం ఆధునిక ప్రపంచానికి చేయవలసిన సేవలు చాలా వున్నాయి. మన తరపున మనం ఈ పరిచర్యలను అందించడానికి సిద్ధంగా వండాలి.