పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత్నవేదంలో మూడు ప్రధాన సందర్భాలు పేత్రు పండ్రెండుమంది శిష్యుల్లో ప్రధానుడని రుజువు చేస్తాయి. మొదటిది, మత్తయి 16,13-19. ఇక్కడ క్రీస్తు సీమోను నామాన్ని కేఫాగా(రాయి) మార్చాడు. తాను నిర్మింపబోయే తిరుసభకు అతన్ని పునాది రాతిని చేసాడు. ఇంకా అతినికి పరలోక రాజ్యపు తాళపుచెవులు(పూర్తి అధికారం) ఇచ్చాడు. వేటినైనా బంధించడానికీ విప్పడానికీ అధికారమిచ్చాడు(సర్వాధికారం) అనగా క్రీస్తు గృహానికి క్రీస్తే యజమానుడు కాగా, పేత్రు ఆ యజమానునికి ప్రతినిధి ఔతాడని భావం. వీటన్నిటిని బట్టి పేత్రు అపోస్తలులలో ప్రధానుడని అర్థం చేసికోవాలి.

రెండవది, లూకా 22,31-32. ఇక్కడ పిశాచం క్రీస్తు మరణ సందర్భంలో అపోస్తలులందరినీ శోధించింది. పేత్రుతో పాటు అందరూ పడిపోయారు. కాని క్రీస్తు ప్రార్థనా బలంవల్ల పడిపోయిన పేత్రు మళ్లాలేస్తాడు. అలా లేచాక అతడు తన సోదరులను బలపరుస్తాడు. ఇక్కడ "సోదరులు" అంటే క్రీస్తుని విశ్వసించే ఇతర అపోస్తలులంతా, వీళ్లందరినీ బలపరచే పేత్రు వీళ్లకు నాయకుడు ఔతాడు కదా! పేత్రు బలహీనుడైనా ప్రభువు అతనికి ఈ నాయకత్వాన్ని దయచేసాడు.
మూడవది, యోహాను 21,15-17. ఇక్కడ క్రీస్తు మూడు పర్యాయాలు తన మందను కాయమని పేత్రుకి చెప్పాడు. అనగా అతన్ని ఖండితంగా తన మందకు నాయకుణ్ణి చేసాడు. క్రీస్తే తన మందకు మంచి కాపరి - 10,10. పూర్వవేద ప్రజలకు యావే కాపరి. అనగా నాయకుడు. ఐనా న్యాయాధిపతులూ రాజులూ నాయకులూ కూడ ప్రజలకు కాపరులే. వీళ్లు యావే అధికారంలో పాలుపొంది యిస్రాయేలు ప్రజలకు నాయకులు అయ్యారు. అలాగే ప్రధాన కాపరియైన క్రీస్తుకూడ పేత్రుకి తన నాయకత్వంలో పాలు పంచియిచ్చాడు. అతడు క్రీస్తనే ప్రధాన కాపరి క్రింద పనిచేసే ఉపకాపరి. ఇంకా ప్రభువు, ఒకే మంద, ఒకే కాపరి అన్నాడు — 10,16. ఈ వొకే కాపరి మొదట పేత్రే. ఈ వొకే కాపరిద్వారా క్రీస్తు మందకు ఐక్యత సిద్ధించింది.
పై మూడు వేదభాగాలు పేత్రు శిష్యుల్లో ప్రధానుడనీ, క్రీస్తు అతనికి ప్రత్యేకాధికారం ఒప్పజెప్పాడనీ రుజువుచేస్తాయి. పేత్రు గొప్పతనం వల్ల అతనికి ప్రత్యేకాధికారం రాలేదు. క్రీస్తు కరుణవల్ల వచ్చింది. క్రీస్తు మెస్సీయా, అతడు పేత్రుని మెస్సీయా సమాజానికి శిరస్సునిగా నాయకుణ్ణిగా నియమించిపోయాడు.
అపోస్తలుల కార్యాలు తొలి 8 అధ్యాయాలు పేత్రు తొలినాటి క్రైస్తవ సమాజంలో ఏలా నాయకత్వం వహించిందీ వివరిస్తాయి. మత్తీయాను పండ్రెండవ అపోస్తలుద్దీగా ఎన్నుకోవడంలో, ఆత్మ దిగివచ్చాక యెరూషలేములో ఉపన్యసించడంలో, కుంటివాణ్ణి స్వస్థపరచాక దేవళంలో మాట్లాడటంలో పేత్రు నాయకత్వం వహించాడు. ఈ పేత్రు ప్రధానత్వం తర్వాత పోపుగారికి లభించింది.