పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెరుగు. క్రీస్తుని ఎరుగనని బొంకినందుకు పేత్రు వెలుపలికి వెళ్ళి వెక్కివెక్కి యేడ్చాడు. -లూకా 22,62. దూర దేశాలనుండి తిరిగివచ్చిన దుడుకుచిన్నవాడు “తండ్రీ! నేను నీకు ద్రోహం చేసాను. ఇకమిూదట నీ కుమారుడ్డి అనిపించు కోవడానికి తగను" అని విన్నవించుకొన్నాడు - లూకా 15,21. పాపాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి మంచి ఉదాహరణలు.

2.పాపంలో నరుడు భగవంతుని నుండి వైదొలగి సృష్టివస్తువుల వైపు వెళ్లాడని చెప్పాం. కాని ఈ సృష్టివస్తువులన్నిటిలోను నరునికి తానంటేనే ఎక్కువ ఇష్టం. కనుక పాపంలో ఎప్పడు గూడ స్వార్థమనేది వుంటుంది. నరుడు తనను తాను అతిగా ప్రేమించుకొని భగవంతుణ్ణి నిరాకరిస్తాడు. ఈ భావాన్నే అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. "యెరూషలేము బాబిలోను అని రెండు పట్టణాలున్నాయి. యెరూషలేము దేవుని నగరం. స్వర్గంలోనిది. బాబిలోను పిశాచనగరం. భూమిమిదిది. భూలోక పట్టణమైన బాబిలోనును నిర్మించేవాళ్లు తమ్ముతాము ప్రేమించుకొని దేవుణ్ణి ద్వేషిస్తారు. పరలోక పట్టణమైన యెరూషలేమును నిర్మించేవాళ్లు తమ్ముతాము ద్వేషించుకొని దేవుణ్ణి ప్రేమిస్తారు." కనుక మనలను మనం ప్రేమించుకొని దేవుణ్ణి నిరాకరించడం పాపం.

3.చాలమంది క్రైస్తవులు పాపాన్ని లెక్కచేయరు, పశ్చాత్తాపపడరు. అతి సులువుగా పాపం చేస్తారు. ఈలాంటివాళ్ళకు బైబులు భగవంతుడు అసలు అనుభవానికి రాలేదనే చెప్పాలి. ఆ ప్రభువు మహాపవిత్రుడు. పాపాన్ని సంపూర్ణంగా అసహ్యించుకొనేవాడు. అతన్ని కొలిచే భక్తులమైన మనంకూడ పవిత్రంగా జీవించాలని కోరుకొనేవాడు - లేవీ 19,2. అర్చ్యశిషులకు పాపచింతనం అత్యధికంగా వుండేది. వాళ్ళు తాము పాపులమనీ, ఆపాపంవల్లనే పవిత్రుడైన భగవంతుడికి యిపులం కాలేకపోతున్నామనీ తలంచి బాధపడేవాళ్ళు తమ పాపాలకు రేయింబవళ్లు పశ్చాత్తాపపడేవాళ్లు, చావైన పాపంచేయడం కంటె చనిపోవడం మేలని యెంచేవాళ్లు. ఈ పాపచింతనం కొదోగొప్పో లేకపోతే మనం యధార్థమైన క్రైస్తవులం కానేకాదు.

4.పాపంవల్ల దేవుని ఆగ్రహానికి గురౌతామని చెప్పంది బైబులు - ఎఫె2,3. దేవుడు మనలను అసహ్యించుకోకపోయినా మనలోని పాపాన్ని మాత్రం తప్పక అసహ్యించుకొంటాడు. కనుక మనకు పాపంమిూద ఏవగింపు రోతా పుట్టాలి.