పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుడు సృష్టికర్తను విడనాడి సృష్టివస్తువుల దగ్గరికి వెళూంటాడు. దుడుకుచిన్నవాడు తన్ను అనురాగంతో చూచే తండ్రిని కాదని దూరదేశాలకు వెళ్ళాడు. నిత్యజీవితంలో మనమూ ఈలాగే చేస్తాం. దేవుని నుండి వైదొలగి లోకవస్తువుల దగ్గరికి వెళూంటాం. బైబులు బోధల ప్రకారం పాపం అంటే యిదే.

ఇక, పరివర్తనమంటే, ఆ సృష్టి వస్తువుల నుండి మళ్ళా దేవుని దగ్గరికి తిరిగిరావడం. దుడుకుచిన్నవాడు మళ్ళా తండ్రిదగ్గరికి తిరిగివచ్చాడు. మనమూ అనురాగమయుడైన దేవుని దగ్గరికీ, అతడు పంపిన క్రీస్తుదగ్గరికీ తిరిగిరావాలి. ఇదే పశ్చాత్తాపం.

ప్రభువు పిశాచాన్ని ఓడించాడు - యోహా 12,31. ఐనా ఈ ఇహలోక యాత్రలో పిశాచం మనలను శోధిస్తూనే వుంటుంది. మనలను తన పక్షానికి ఆకర్షించుకొంటూనే వుంటుంది. ఎప్పుడూ యిద్దరు నాయకులు మనలను బలంగా ఆకర్షిస్తారు. ఒకవైపు క్రీస్సూ, మరోవైపు పిశాచమూ, మనం పిశాచపక్షాన్ని విడనాడి క్రీస్తు పక్షాన్ని అవలంబించగలిగి వండాలి. జ్ఞానస్నాన సమయంలో గురువు నీవు పిశాచాన్నీ దాని ఆడంబరాలనూ విసర్జిస్తావా అని అడిగితే మనం విసర్టిస్తాను అని జవాబు చెప్తాం. ఈ జవాబుని నిత్యజీవితంలో జీవించడమే యథార్థమైన పరివర్తనం ఔతుంది. ఇంకా, ఈ పరివర్తనాన్ని బలపరచడానికే జ్ఞానస్నాన సమయంలో మనచేత పిశాచ విసర్జన ప్రమాణం చేయిస్తారు. గురువుపిశాచాన్ని పారద్రోలే జపాలు జపిస్తారు. క్రీడాకారులకులాగ మనకు గూడ తైలంతో అభ్యంగనం చేయిస్తారు. మనం ఈ పుణ్యక్రియల బలంవల్లా, సొంత ప్రార్ధనవలని బలంవల్లా చిత్తశుద్ధితో పశ్చాత్తాపడి జ్ఞానస్నానాన్ని స్వీకరించాలి.

2) విశ్వాసం. ఫిలిప్ప ఇతియోపీయ ఉద్యోగి రథంమీదికెక్కి కూర్చుండి అతనికి క్రీస్తుని గూర్చి బోధించాడు. ఆ యుద్యోగి తనకు జ్ఞానస్నానమీయమని అడిగాడు. ఫిలిప్ప నీవు పూర్ణహృదయంతో ప్రభువుని విశ్వసిస్తే ఆసంస్కారాన్ని పొందవచ్చు అనిచెప్పాడు. ఆ ఉద్యోగి నేను క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తూనే వున్నాను అని బదులు చెప్పాడు అప్పడు ఫిలిప్ప అతనికి జ్ఞానస్నానమిచ్చాడు - అచ 8, 35-37. కనుక జ్ఞానస్నానాన్ని యోగ్యంగా పొందాలంటే క్రీస్తుని విశ్వసించాలి. ఇంకా ఉత్థానక్రీస్తు "విశ్వసించి జ్ఞానస్నానం పొందినవాడు రక్షణం పొందుతాడు. విశ్వసించనివానికి శిక్ష తప్పదు" అని వాకొన్నాడు -- మార్కు 16, 16.

జ్ఞానస్నాన తంతులో గురువు మనలను "మీరు శ్రీసభనుండి ఏమి కోరుతున్నారు?" అని ప్రశ్నిస్తారు. మనం విశ్వాసాన్ని అని బదులు చెప్తాం. కనుక జ్ఞానస్నానాన్నిస్వీకరించాలంటే విశ్వాసం వండాలి. ఈ సందర్భంలో భక్తుడు జెరోము ఈలా వ్రాసాడు. “అపోస్తలులు మొదట