పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావం. ఈ విశ్వాసం పూర్వం అబ్రాహామునిలాగే ఈనాడు మనలనుగూడ నీతిమంతులను జేస్తుంది. అతనికిలాగే మనకుగూడ రక్షణాన్ని దయచేస్తుంది - రోమా 4,19.

ఆత్మ దయచేసే విశ్వాసంద్వారా క్రీస్తుని నమ్ముతాం. అతని మరణిశోత్తానాల శక్తిని విశ్వసిస్తాం, క్రీస్తుకూడ తన ఆత్మద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఒకోసారి క్రీస్తుపట్ల మనకు విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాంటప్పడు ఆ విశ్వాస వరాన్ని బలపరచమని ఆత్మనే అడుగుకోవాలి.

3. మోక్షాన్ని చేరుకొని క్రీస్తుని దర్శిస్తామని నమ్మడమే నిరీక్షణం, ఈ వరాన్ని మనకు దయచేసేదికూడ ఆత్మమే. ఆత్మవల్లనే మనం దేవుని పుత్రులమౌతాం. ఈ వారసం మనకు లభిస్తుందనడానికి ఆత్మే హామీ - ఎఫె 1,14. కనుక మనం మోక్షాన్ని ఆశించేలా చేసేదీ, ఆ భాగ్యం మనకు దక్కుతుందని నమ్మేలా చేసేదీ ఆత్మే ఇంకా ఈ యాత్మ మనం ఈ మోక్షభాగ్యం కొరకు ఆశతో ఎదురుచూచేలా చేస్తుంది. బాధతో మూలిగేలాకూడ చేస్తుంది - రోమా 8,13. ఒకోసారి మనం ఈ లోక భాగ్యాలతోనే సంతృప్తి చెందుతాం. పరలోక భాగ్యాలను ఆశించం. ఈ దౌర్భాగ్యం నుండి మనలను కాపాడమని ఆత్మనే అడుగుకోవాలి. మనకు స్వర్గ సంపదలమీద కోరిక పుట్టించమని ఆ ప్రభువుని వేడుకోవాలి.

ప్రార్థనా భావాలు

1. పిత, సుతుడు, పవిత్రాత్మ అనే ముగ్గురు దైవవ్యక్తులకుగల సంబంధాన్నివేదశాస్తులు కొన్ని వుపమానాలతో వివరించారు. టెరూలియన్ ఈలా చెప్పాడు. "మొదట తండ్రి వున్నాడు. అతనినుండి కుమారుడు బయలుదేరుతాడు. వారిరువురినుండి కడన ఆత్మడు బయలుదేరుతాడు. ఏలాగంటే, వేరునుండి చెటూ ఆ చెట్టునుండి ఫలమూ ఉద్భవిస్తాయి. జలధారనుండి నదీ ఆ నదినుండి కాల్వా బయలుదేరుతాయి. సూర్యునినుండి కిరణాలూ వాటినుండి ప్రకాశమూ పడతాయి."

2. అతనేష్యస్ భక్తుడు ఈలా వివరించాడు, “తండ్రి దీపం, కుమారుడు దీపకాంతి. ఆత్మడు ఆ కాంతితో మనలను వెలిగించేవాడు. ఇంకా తండ్రి జలధార, కుమారుడు ఆ ధారనుండి పుట్టిన నది. ఆ నదినుండి మనం త్రాగేనీరు ఆత్మ."

3. దీపం తన కాంతితో అన్ని వస్తువులను ప్రకాశించేలా చేస్తుంది. అలాగే ఆత్మ తాను సోకినవారందరినీ తేజోమయులను చేస్తుంది.