పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. కొందరు ఆత్మ ప్రబోధాన్ని పెడచెవిని బెడతారు. శరీర వాంఛలకు లొంగిపోయి పాపంలో బడతారు. అప్పడు కూడ ఆత్మ వాళ్ళను వదిలిపెట్టదు. వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాప భావాలు పుట్టిస్తుంది. వాళ్ళకు పరివర్తనం కలిగిస్తుంది. పూర్వం జక్కయ అన్యాయంగా సొమ్ముజేసి కొంటూండగా ప్రభువు అతన్ని మందలించి అతనికి పరివర్తనం కలిగించాడు - లూకా 19,1-10. ఈ రీతిగానే ఆత్మ మనలనుగూడ మందలిస్తుంది. అతడు ఓ దేవళంలోకిలాగ మన యెడదల్లోకి వేంచేస్తాడు. మన హృదయ దేవాలయాన్ని శుద్ధిచేస్తాడు. ఆత్మ శిష్యుల మీదికి వేంచేసింది పాపపరిహారాన్ని దయచేయడానికే. కనుకనే ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి ఆత్మనువూది మీరు ప్రజల పాపాలు మన్నించండి అని చెప్పాడు - యోహా 20,22-23.

3. ఆత్మ మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. ఆత్మ వున్నచోట స్వాతంత్ర్యముంటుంది -2కొ 3,17. ఈ స్వేచ్ఛ ప్రధానంగా పాపంనుండే - రోమా 8,2. పాపం చేసేవాళ్ళు పిశాచానికి బానిసలౌతారు. ఆత్మ మనలను దేవునికి దత్తపుత్రులనుగా జేసి ఈ స్వేచ్చను ప్రసాదిస్తుంది. మనకు స్వేచ్చనిచ్చేవాడు తండ్రే. అది మనకు క్రీస్తుద్వారా ఆత్మ సహాయం వలన లభిస్తుంది. కుమారుడు మిమ్ముస్వతంత్రులను జేస్తే మీరు నిజంగా స్వతంత్రులౌతారు అన్నాడు ప్రభువు - యోహా 8,36.

ఐతే స్వేచ్ఛ అంటే నియమాలు మీరి విచ్చలవిడిగా సంచరించడం గాదు. అది అరాజకం అనిపించుకొంటుంది, నిజమైన స్వేచ్చ ఇతరులకు సేవలు చేయడానికి పూనుకొంటుంది. “ఈ స్వేచ్ఛవలన మీరు లౌకిక వ్యామోహాలకు లొంగిపోగూడదు. దీనిద్వారా ఒకరికొకరు సేవలు చేయండి" - గల 5, 13. క్రీస్తు సర్వతంత్ర స్వతంత్రుడు, కాని అతడు శిష్యుల కాళ్ళూ కడిగి వారికి సేవలు చేసాడు. పౌలు కూడా స్వతంత్రుడే కాని అతడు అందరికీ దాసుడై సేవలు చేసాడు. ఈ మహానుభావులు మనకు ఆదర్శం కావాలి. అగస్టీను చెప్పినట్లు, భక్తి భయంతో ప్రారంభమౌతుంది. ఇది పూర్వవేద పద్ధతి. కాని భక్తి ప్రేమతో గూడిన సేవాకార్యాలతో ముగుస్తుంది, ఇది నూత్నవేద పద్ధతి.

4. ఇంకా, దైవభక్తుల్లో ఓ రకమైన ధైర్యం కన్పిస్తుంది. ఈ ధైర్యం ఆత్మవరమైన స్వేచ్ఛనుండే జనిస్తుంది. మాకు ఇంత నమ్మకం వుంది కనుకనే మేము ఇంత ధైర్యంతో వున్నాం అన్నాడు పౌలు-2కొ 3,12. శిష్యులు పవిత్రాత్మతో నిండినవారై ధైర్యంతో క్రీస్తు సందేశాన్ని విన్పించారు - అచ 4,31. ప్రాచీన వేదసాక్షులు తమ్ము హింసించేవారిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. నేడుకూడ కొంతమది భక్తుల్లో ఈ ధైర్యం కొట్టవచ్చినట్లుగా కన్పిస్తుంది. ఇది ఆత్మయిచ్చే వరమే.