పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌలుకి కూడ ఈ భావాలు తెలుసు. మనమందరం ఒకే ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందాం. అందరమూ ఒకే ఆత్మను పానం చేస్తాం - 1కొ 12,13. ఇక్కడ ఆత్మను పానం చేస్తామంటే, శ్రీసభలోని ఆత్మను మనంకూడ స్వీకరిస్తామని భావం. ఇంకా, మోషే ధర్మశాస్త్రం మృత్యువును తెచ్చిపెడుతుంది. కాని ఆత్మ జీవనదాత - 2కొ 8,6.

ప్రార్థనా భావాలు

1.బార్ హెబ్రెయస్ అనే సిరియా భక్తుడు ఈలా వాకొన్నాడు, "పవిత్రాత్మ ప్రధానంగా జీవం. లోకంలోని జీవమంతా ఆ ఆదిమ జీవంనుండి వచ్చిందే. ఆ దివ్యజీవం తండ్రినుండి బయలుదేరి కుమారుని ద్వారా లోకంలోకి వచ్చింది. లోకరీలోని నరులందరికీ ప్రాణమొసగి వారిని దివ్యలనుగా జేస్తుంది. ఆ నరులద్వారా లోకాన్నంతటినీ దివ్యం చేస్తుంది." మనంకూడ దివ్యజీవాన్ని దయచేయమని ఆత్మను నిరంతరం ప్రార్ధిస్తుండాలి.

2.యెరూషలేము సిరిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "క్రీస్తు ఆత్మను జలంగా ఎందుకు పేర్కొన్నాడు? జలం వల్లనే అన్నీ బ్రతుకుతాయి. నీరు నూత్నజీవానికి మూలం. అది పైనుండి దిగివస్తుంది. నీరు ఒక్కటైనా బహువిధాలుగా మారుతుంది. ఏదెను తోటకంతటికీ ఒకే నీటిబుగ్గ నీరు పెట్టింది. ప్రపంచమంతటినీ ఒక్కవానే తడుపుతుంది. ఆ ఒక్క జలమే లిల్లీలో తెల్లగాను, గులాబీలో ఎర్రగాను, మరో పూవులో ముదురు కెంపు వన్నెగాను కన్పిస్తుంది. ఒకే జలం ఆయా వస్తువులకు అనుకూలంగా మారిపోతుంది. ఆత్మకూడ ఒక్కడైనా తన చిత్తాన్నిబట్టి తన వరప్రసాదాలను అనేకులకు అనేక విధాలుగా పంచిపెడతాడు. కనుకనే క్రీస్తు అతన్ని నీటితో పోల్చాడు". ఆత్మజలం మనపై సమృద్ధిగా కురవాలనీ, ఆ నీటిలో మన శరీరాలూ హృదయాలూ నానాలనీ అడుగుకొందాం.

8. రక్షణ చరిత్రను నడిపించే ఆత్మ

1. దేవుడు మట్టిముద్దలోనికి ఊపిరి ఊది నరుని చేయడంతో నరజాతి చరిత్ర ప్రారంభమైంది - ఆది 2,7. దేవుడు వూదిన ఆ వూపిరి ఆత్మే తర్వాత ప్రభువు యిప్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. కాని యూదులు ఆ ప్రభువు నిబంధనాన్ని మీరారు.

యిప్రాయేలీయులు దేవునిమీద తిరగబడి
అతని పవిత్రాత్మను దుఃఖపెట్టారు