పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసారు. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు కడన కొన్ని తీర్మానాలు తయారుచేసారు. ఈ తీర్మానాలు పౌలు పేత్రు మొదలైన అపోస్తలులు తయారుచేసినవి మాత్రమేకావు. అపొస్తలులతోపాటు పరిశుద్దాత్మ కూడ ఈ నిర్ణయాలను ఏర్పాటు చేసింది.

8. ఫిలిప్పు వృత్తాంతం - అ.చ. 8,26-40.

ఇతియోపియా రాణి ఉద్యోగి యొకడు యెరూషలేమునకు వెళ్లి ప్రభువును సేవించుకొని తిరిగిపోతూ యెషయా ప్రవక్త గ్రంథం విప్పాడు, "అతన్ని గొర్రెలాగ వధ్యస్థానానికి నడిపించుకొని వెళ్ళారు. ఐనా గొర్రెపిల్లలాగ అతడు మౌనంగావుండి పోయాడేగాని నోరు తెరువలేదు" అన్న ప్రవక్తవాక్యాలు అతని కంట బడ్డాయి. ప్రవక్త ఎవరిని గూర్చి ఈలా వ్రాసాడబ్బా అని విస్తుపోయాడు ఆ వుద్యోగి. అంతలోనే ఆత్మ ఫిలిప్పను అతని యొద్దకు పంపింది. ఫిలిప్ప రథంమీదికెక్కి ఆ వుద్యోగిప్రక్కనకూర్చున్నాడు. ప్రవక్త క్రీస్తును గూర్చే ఈ వాక్యాలు వ్రాసాడని వివరించి చెప్పాడు. అంతలో వాళ్ల ఓ మడుగు దగ్గరకు వచ్చారు. ఫిలిప్ప ఆ ఉద్యోగికి జ్ఞానస్నానం ఇచ్చాడు. అటు పిమ్మట ఆత్మ మల్లా ఫిలిప్పను తీసుకొని వెళ్లిపోయింది.

పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా చాలా అద్భుతాలు చేయించింది. ఈ అద్భుతాలు చూచి చాలమంది క్రైస్తవ సమాజంలో చేరిపోయారు - అ.చ. 2, 43. క్రైస్తవమతాన్ని అవలంబించిన విశ్వాసులకు ఆత్మ ఆదరణాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తుండేది - అ.చ. 9,31. ఈ వృత్తాంతాలన్నీ ఆత్మ నాయకత్వానికి చక్కని ఉదాహరణలు .

9. ఆత్మను మోసపుచ్చరాదు - 5, 1-11.

యెరూషలేములోని తొలినాటి క్రైస్తవులు ఉమ్మడి జీవితం జీవిస్తుండేవాళ్లు, వాళ్లకు సొంత ఆస్తి అంటూ వుండేది కాదు, అననీయ అనే ఓ గృహస్తుకూడ ఈ క్రైస్తవ సమాజంలో చేరాడు. అతడు తన ఆస్తిని అమ్మి కొంత డబ్బు మోసంతో జేబులో వేసుకొని, మిగిలిన డబ్బును మాత్రమే పేత్రునకు ఒప్పజెప్పాడు. ఈ లాంటి పని చేసి పరిశుద్దాత్మను మోసపుచ్చావుగదా అని పేత్రు అతన్ని శపించాడు. వెంటనే అననీయ ప్రాణాలు విడిచాడు.

తరువాత అననీయ భార్య సఫీరా వచ్చింది. భర్తకు పట్టిన దుర్గతి ఆమెకింకా తెలియదు. మా ఆస్తిని ఈ పాటి వెలకే అమ్మామని ఆమెకూడ పేత్రు నెదుట బొంకింది. పరిశుద్దాత్మను ఈలా శోధించావు గదా అని పేత్రు ఆమెనూ శపించాడు. వెంటనే ఆమె కూడ అక్కడే ప్రాణం విడిచింది. మనం కూడ బుద్ధి పూర్వకంగా దుష్కార్యం చేసినపుడెల్ల ఆత్మనే మోసపుచ్చుతూన్నాం. ఆత్మనే శోధిస్తున్నాం. కనుక ఈలాంటి పనులు చేయగూడదు.