పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్ధనం. ప్రార్ధనం అంటే భగవంతుని సన్నిధిలో మెలగడం. ఆ ప్రభువు సాక్షాత్కారం కలిగించుకొని స్నేహితుడు స్నేహితునితో మాటలాడినట్లుగా అతనితో మాటలాడ్డం. పరిచయం ద్వారాగానీ స్నేహం ఏర్పడదు. కనుక భక్తుడు ప్రార్ధనద్వారా భగవంతునితో గాఢపరిచయం కలిగించుకోవాలి. క్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఆలాగే మనం కూడ క్రీస్తుద్వారా పరలోకంలోని తండ్రికి ప్రార్ధన చేయాలి. ఆత్మే మనకీ శక్తి నిస్తుంది - గల 4,6. ఇంకా, క్రీస్తు అందరికోసం ప్రార్థన చేసేవాడు - హెబ్రే 7, 25. అతనిలాగే మనం కూడ విశ్వమానవాళికోసం ప్రార్థన చేయాలి. ఈ సృష్టి అంతా పునీతం కావాలి అని జపించాలి. పెంతెకొస్తు ఉద్యమంలో భక్తులు విశేషంగా స్తుతిప్రార్ధనం చేస్తారు. దానితోపాటు ఇతరులకోసం విజ్ఞాపన ప్రార్ధనం కూడ చేస్తారు. మన క్యాతలిక్ సమాజంలో చాలమందికి ప్రార్థన చేసి కోవడమంటే మోక్షవాకిలివంటి పుస్తకాలు తెరచి ఏవో కొన్ని అచ్చు జపాలు వల్లెవేయడం. కాని ఇది చాలదు. ప్రార్థన ఓ అనుభవం. ప్రార్థనలో మనం భగవంతునితో హృదయం విప్పి మాట్లాడాలి. ఆ ప్రభువుని మనతో మాట్లాడనీయాలి కూడ. అతని సంభాషణను మన హృదయాంతరాళంలో వినాలి. అప్పుడే మనకు భగవంతునిపట్ల ఓ అనుభవమంటూ కలిగేది.

భార్య భర్తదగ్గరికి వస్తుంది. తన కాలాన్ని అతని సేవలో వినియోగిస్తుంది. అతనిపట్ల ఆప్యాయంగా మెలుగుతుంది. దానివల్ల ఆమెకు అతనిపట్ల ఓ మధురమైన అనుభూతి కలుగుతుంది. భగవత్సేవలో కూడ ఈలాగే జరగాలి. మనం కొంత కాలాన్ని ప్రార్థనకు వినియోగించాలి. దీర్ణప్రార్థనాభ్యాసం వలనకాని భగవంతుడు అనుభవానికిరాడు. చిరకాల ప్రార్ధనంద్వారా భక్తిపడుతుంది. ఈ భక్తికి భగవంతుడు వశుడైపోతాడు. చాలమంది క్రైస్తవులు ప్రార్థనకు సమయాన్ని వినియోగించనే వినియోగించరు. ఇక వీళ్ళకు ప్రభువుపట్ల అనుభవం ఏలా కలుగుతుంది?

4. భక్త సమాజం. పెంతెకోస్తు ఉద్యమం ద్వారా మనం క్రీస్తుతో సంబంధం పెట్టుకొంటాం. ఈలా క్రీస్తుతో సంబంధమున్నవాళ్ళకు అతని జ్ఞానదేహమైన తోడి జనంతో కూడ సంబంధం వుండాలి - రోమా 12, 25, ఇదే భక్తసమాజం, యిస్రాయేలు మతంలోగాని క్రైస్తవమతంలోగాని ప్రధానమైంది వ్యక్తిగత రక్షణంకాదు, సామాజిక రక్షణం.

మనం తోడి భక్తులతోకూడి ప్రార్ధనం చేసేపుడూ ప్రభుని స్తుతించి గానం చేసేపుడూ మన విశ్వాసం కూడ పెరుగుతుంది. మన హృదయంకూడ గాఢప్రేమతో పొంగిపోతుంది. కనుక మనం ఇరుగుపొరుగు వాళ్ళతోకూడి ఓ ప్రార్థనాసమావేశాన్ని