పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్పాటు చేసికోవాలి. ఈ సమాజం నియమిత సమయాల్లో సమావేశమై ప్రార్థనలు జరుపుకోవాలి. ఈ బృందంలో ఒకరితో ఒకరికి హృదయాలు కలవాలి. పరిచయాలు ఏర్పడాలి.

మనకు ఆత్మతో సహవాస మేర్పడిన కొలదీ తోడి ప్రజలతో కూడ స్నేహం పెరుగుతుంది - 2 కొ 13, 13. ఈ యాత్మే మనమందరమూ ఒక్కటిగా ఐక్యమయ్యేలా చేస్తుంది. మనలోని భేదభావాలూ, పరస్పర అనిష్ణాలూ, ఫిర్యాదులూ తొలగిపోయి ఒకరినొకరం ప్రేమభావంతో ఆదరించుకోవడం మొదలిడతాం. ఇదే సోదరప్రేమ. ఆత్మ యిచ్చే సేవా వరాలద్వారా క్రైస్తవ సమాజాన్ని వృద్ధిలోకి తెస్తాం.

పెంతెకోస్తు ఉద్యమం ప్రేమోద్యమం. ఈ వుద్యమంలో జనులు ఒకరినొకరు ప్రేమించడానికీ ఒకరి నుండి ఒకరు ప్రేమను పొందడానికీ సమావేశమౌతారు. కనుక మన తరపున మనం ఇతరులను ప్రేమించి అంగీకరించాలి. ఇతరుల ప్రేమాదరాలను పొందాలి కూడ.

5. సేవా జీవితం. భగవంతుడు నరులను తనకు పోలికగా కలిగించాడు. తాను వాళ్లల్లో జీవిస్తుంటాడు. కనుక మనం తోడి మానవుల్లో వున్న భగవంతుణ్ణి గుర్తించగలిగి వుండాలి. వాళ్లకు సేవ చేయాలి. తోడి నరులకు సేవ చేస్తే ప్రభువు ఆ సేవ తనకు చేసినట్లే భావిస్తాడు - మత్త 25, 40. క్రీస్తు ప్రభువు మహా సేవకుడు - మార్కు 10, 45. ఆ ప్రభువులాగే అతని శిష్యులు కూడ తోడి జనానికి సేవలు చేయడం నేర్చుకోవాలి — లూకా 22, 26, కాని ఈ క్రీస్తు చేసింది కేవలం సాంఘికసేవ గాదు. అతడు సేవ చేయడానికి దేవునిచే నియుక్తుడయ్యాడు. ఆత్మచే ప్రభోధితుడయ్యాడు - లూకా 4,18. హృదయపూర్వకంగాను ప్రేమ భావంతోను ఆ సేవ చేసాడు. ఆ ప్రభువులాగే మనం కూడ చిత్తశుద్ధితో తోడి నరులకు సేవ చేయాలి. ఈ సేవ స్వార్ధలాభానికీ గాదు. కీర్తిప్రతిష్టలకూ గాదు. సేవ చేయడం క్రీస్తు శిష్యులమైన మన విధి. ఇక్కడ కూడ ప్రేమ చూపడం ముఖ్యం. అసలు ప్రేమకు మించిన సేవ లేనేలేదు. జీవితంలో చాలమంది ప్రేమాదరాలకు నోచుకోరు. కనుక మనం కొంచెం ప్రేమతో ప్రవర్తించగానే తోడినరుల హృదయాలు సూర్యకిరణాలు సోకిన పద్మంలా వికసిస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించి మనం తోడి జనంతో మెలిగేపుడు వాళ్లపట్ల ఆప్యాయంగా ప్రవర్తించాలి. మన ప్రార్థనాసమాజానికి చెందిన భక్తులకు సేవ చేయాలి. మన కుటుంబానికి సేవ చేయాలి. మన వూళ్ళ, మన చుటూరా వున్న జనానికీ సేవ చేయాలి. తోడి జనం