పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపోతుందా? ఎంతమాత్రమూ చాలదు. అందుకే పెంతెకోస్తు ఉద్యమం సభ్యులు అవశ్యం సామాజిక స్ఫురణను అలవర్చుకోవాలని చెప్పాం. కాని సామాజిక స్ఫురణం అంటే యేమిటి?

మనం రెండు పనులు చేయాలి. మొదటిది, మనకున్నది లేనివాళ్ళతో పంచుకోగలిగివుండాలి. మనమే పేదవాళ్ళమైతే ఇక వేరేవాళ్ళకు ఏమి సహాయం చేయగలం అనుకోగూడదు. పాలల్లోకి పంచదార లేక ఒకమ్మ ఏడుస్తూంటే నీళ్ళల్లోకి ఉప్పగల్లు లేక మరొకమ్మ ఏడుసూంటుందట! కనుక మనకంటె పేదవాళ్లగూడ చాలమంది వుంటారు. ఈలాంటి నిరుపేదలతో మనకున్నది తులమో ఫలమో పంచుకోగలిగి వుండాలి. ఈలా పంచుకోనివాడు క్రీస్తు శిష్యుడు కాలేడు.

రెండవది, దేశంలో పేదలకు ఎన్నయినా అన్యాయాలు జరుగుతూన్నాయి. ఈలాంటి అన్యాయాలను చక్కదిద్దడానికి పూనుకోవాలి - మనకు చేతనయినంతవరకు, అనగా అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది కష్టమైన కార్యం. ఇంకా పేదలను ప్రోత్సహించి వాళ్ళ స్వయం ఉపాధి పథకాలతో వృద్ధిలోకి వచ్చే కార్యక్రమాలను గూడ చేపట్టాలి. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు ఈ రంగంలో బోలెడంత సేవచేయవచ్చు. పేదలకు దానధర్మాలు చేయడం కంటెగూడ వాళ్ళకున్న అవకాశాలను గూర్చీ వాళ్ళకు జరిగే అన్యాయాలను గూర్చీ వాళ్ళకు చైతన్యం కలిగించడం ఎక్కువ లాభకరం, మనం వ్యక్తిగతంగా కంటె ఓ ఓ బ్రుందంగా ఈలాంటి సాంఘికసేవ చేయడం మేలు. ఏమైతేనేమి, మన తరపున మనం ఏదో వొక సాంఘిక సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. అప్పడేగాని మన పెంతెకోస్తు భక్తి యథార్థమైన భక్తి కాదు. ఇక్కట్టల్లో వున్న తోడినరుణ్ణి పట్టించుకోకుండా దేవుడికి వంకవంక దండాలు ఎన్ని పెడితే మాత్రం ఏమిలాభం?

22. పెంతెకోస్తు భక్తిని నిల్పుకోవడం ఏలా?

1. ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందడం ఓ వివాహంలాంటిది. వివాహంద్వారా భార్యకు భర్తతో క్రొత్తసంబంధం ఏర్పడుతుంది. ఆలాగే ఈ ఉద్యమం ద్వారా భక్తునికి భగవంతునితో నూత్న సంబంధం కలుగుతుంది.

ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందడం అంటే బాధ్యతాంతంకాదు. బాధ్యతారంభం. తల్లి బిడ్డను కనడంతోనే పని ముగియదు. ఇంకో క్రొత్తబాధ్యత ప్రారంభమౌతుంది. ఆలాగే ఆత్మ జ్ఞానస్నానం కూడాను. దీని ద్వారా జీవితరథం కదులుతుంది, అంతే. ఇక ఈ రథాన్ని లాగుకొనిపోయే బాధ్యత మనది.

పౌలు "నాకు జీవించడం అంటే క్రీస్తుని జీవించడమే" అన్నాడు – ఫిలి 1,21. "ఇప్పుడు నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అని చెప్పాడు - గల 2,20.