పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాని ప్రమేయం లేకుండానే మనచే ప్రార్ధనం చేయిస్తాడు. ఈ ప్రార్ధనంలో మనం దేవునికి లొంగిపోతాం, మన మిడిసిపాటు సమసిపోతుంది.

3) పైగా ఈ రకపు ప్రార్థనలో "మీరు పరివర్తనంచెంది చిన్నబిడ్డల్లా తయారు కావాలి" అన్న ప్రభువాక్యం నెరవేరుతుంది - మత్త 18,3. ఎవరు సరళస్వభావులు గాను వినయవంతులుగాను మెలుగుతూంటారో వాళ్లకు అందరికంటే ముందుగా ఈ ప్రార్ధనం అలవడుతుంది.

4. ఈ ప్రార్ధనంవల్ల ఏమి లాభం? పౌలు భాషల్లో మాట్లాడేవాడు తన క్షేమాభివృద్ధిని సాధిస్తున్నాడు అన్నాడు - 1కొ 14,14. ఈ ప్రార్ధనవల్ల మనకు ఎన్నో మేళ్లు కలుగుతాయి.

1) దీనివల్ల దేవునియందు మనకు విశ్వాసం పెరుగుతుంది. ధ్యానానికి ముందు ఈ ప్రార్ధనం చేసికొన్నట్లయితే ఆ ధ్యానం సుకరమౌతుంది. బైబులు పఠనానికి ముందుకూడ ఈ జపాన్ని వాడుకోవడం మంచిది.

2) సందేహాలు కలిగినపుడు మన అనుమానం తీర్చుకోవడానికీ, తగిన పద్ధతిలో నిర్ణయాలు చేసికోవడానికీ, ఇతరులకు మంచి ఆలోచన చెప్పడానికీ ఈ జపం ఉపయోగ పడుతుంది. ఈ జపంద్వారా పవిత్రాత్మ మనలను మంచి త్రోవలో నడిపిస్తుంది.

3) ఒకోమారు మన అవసరాలేమిటివో, ఇతరుల అవసరాలేమిటివో మనకు తెలియనే తెలియవు. ఐనా అవి అతిముఖ్యమైన అవసరాలే కావచ్చు. ఆలాంటప్పుడు ఈ విధానం ద్వారా ఆ తెలియని అవసరాలకొరకు గూడ ప్రార్ధనం చేయగలం. ఉదాహరణకు, మనందరిలోను బాధాకరమైన పూర్వస్మృతులు కొన్ని వుంటాయి. అవి యేమి స్మృతులో ఇప్పడు మనకు స్పష్టంగా తెలియదు. కాని ఈ జపం ద్వారా ఆ పూర్వ స్మృతులకు చికిత్స పొందగలం - రోమా 8, 26-27.
 
4) ఈ వరాన్ని వినయంతోను సరళస్వభావంతోను అంగీకరించేవాళ్లు ఆత్మయిచ్చే ఇతర వరాలను పొందడానికి గూడ అరుబ్రౌతారు.
 
5. భాషలలో ప్రార్ధనచేసే వరాన్ని సంపాదించడం ఏలా? అది ప్రభువే ఇచ్చే వరం. అతడు దప్పికిగొన్నవాళ్లు తనవద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు అన్నాడు. ఆయనను నమ్మినవాళ్ళ అంతరంగంలో నుండి జీవజల ప్రవాహం పొంగి పారుతుంది అన్నాడు. ఆ ప్రవాహమే పరిశుద్ధాత్మ కనుక పరిశుద్ధాత్మను మనమీదికి పంపి ఆ యాత్మద్వారా మనకు ఈ ప్రార్ధనా వరాన్ని దయచేయమని క్రీస్తుని అడుగుకోవాలి - యోహా 7,37-38.