పుట:Bhagira Loya.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

తాను బొమ్మలరాణి. ఇంత చిన్నప్పుడు తాను గొంతుక యెత్తడం ప్రారంభించి నప్పటి నుంచిన్నీ జట్టు వాళ్ళూ, పల్లెటూళ్ళలో యితర్లూ తన్ను యెంతో ఆదరించే వాళ్లు. తాతగారికీ, తండ్రికీ గారాబు బిడ్డ. ఆలాంటి తన హృదయానికి తన రాజ్యానికి మించిపోయిన మహారాజ్యం ఓటి ప్రత్యక్షమైంది. ఆమె మనస్సు ఓ విధమైన వాంఛా మేఘంలో అలుముకుపోయింది. అన్నీ సుళ్లు చుట్టిపోయే ఆలోచనలే. అంతలో భయం.

తాను సంగీతంలో సేలం గోదావరి లా, బెంగుళూరి నాగరత్నం లా పేరు సంపాదించుకోవచ్చును. అది ఆఖరు కాదు కదా యీవాళ నుంచి? కామేశ్వర్రావు మళ్ళీ తోలుబొమ్మలాట మొదలుపెట్టించాడేమి? ఎంతబాగున్నా తోలుబొమ్మలాట మళ్ళీ వద్దు.

ఆమెకు గాడిద లద్దెలవాసనా, ఏళ్ళతరబడి చెమటలో తడి ఆరిపోయిన, భయంకరమైన ఛండాలపు మురికిగుడ్డల వాసన మళ్ళీకొట్టినవి. ఒళ్లు జలదరించింది. కళ్ళనీళ్లు తిరిగినవి. ఆ నరకంలోంచి రక్షించిన దైవసమానులు సీతారామయ్యగారు, కామేశ్వర్రావుగారు. వాళ్లు మళ్ళీ అధోలోకం లోకి తన్ను తోసివెయ్యరు కదా! అమ్మయ్యో!!

ప్రదర్శనం అయిన మర్నాటినుంచి కామేశ్వర్రావును చూడ్డానికి ఆమెకు భయం వేసింది. ఒకనాడు కామేశ్వర్రావు ఆమె దగ్గరకు వచ్చాడు.

93