పుట:Balavyakaranamu018417mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. ఒకానొకచో విశేషణంబుల షష్ఠికిం బ్రథమ విభాష నగు.

సుగుణాభిరాముఁడు రామునకు జోహారు వొనర్చెద - సుగుణాభిరామునకు రామునకు జోహారు వొనర్చెద.

28. భవత్యర్థ వ్యవహితంబులగు విశేషణంబులకుం బ్రథమ యగు.

అగు మొదలగునవి భవత్యర్థములు. విద్యాశాలియగు పురుషుని సకల జనులు సన్మానింతురు. భూతదయాళురగు మహాత్ములకు శ్రేయంబు గలుగును. అతిమానుష మత్యద్భుత మతిదుష్కర మయిన కేశవార్జున కృతి.

29. భవత్యర్థకంబు సన్నిహిత విశేషణంబునకును, దాని ముందు విశేషణంబుల కయి పదంబును బహుళంబుగా ననుప్రయుక్తం బగు.

అతులుఁడయి యప్రమేయుఁడౌ హరిని గొలుతు.

30. అయి పదానుప్రయోగంబు లేనిచోఁ దుదివిశేషణంబున కేని, విశేషణంబు లన్నింటికేని మీఁద సముచ్చయార్థంబు విభాషం బ్రయోగింపఁబడు.

ఆద్యుఁ డప్రమేయుఁడు నగు హరిని గొలుతు. ఆద్యుఁడు నమేయ గుణుఁడు నౌ హరిని గొలుతు. ఆద్యుఁ డప్రమేయుండగు హరిని గొలుతు.