పుట:Balavyakaranamu018417mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. ఉదంత జడంబు తృతీయకు నవర్ణకం బగు.

రాముఁ డొక్క బాణంబున వాలింగూలనేసె - బాణముచే నని యర్థము.

24. జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.

వాఁడు పూవులు దెచ్చె - వాఁడు పూవులను దెచ్చె. ఆకె సొమ్ములు దాల్చె - ఆకె సొమ్ములను దాల్చె. వాఁడిల్లు వెడలె - వాడింటిని వెడలె. బహుళకముచేఁ దృతీయా సప్తములకు విధించిన ద్వితీయకుం బ్రథమ రాదు.

25. కాలాధ్వములకుం బ్రాయికంబుగాఁ బ్రథమ యగు.

వాఁడు నిన్నవచ్చె - వీఁడు నేఁడు వోయె - మాపు నిలువుము - ఱేపు పొమ్ము - వారు క్రోశము నడచిరి - వీ రామడవోయిరి.

26. సర్వనామ సంఖ్యాభిధాన తద్విశేష్యంబుల యందెయ్యది ముందు ప్రయోగింపబడు, దాని ద్వితీయాదులకుం బ్రథమ బహుళంబుగా నగు.

అన్ని గుఱ్ఱములకు - అన్నింటికి గుఱ్ఱములకు - గుఱ్ఱము లన్నింటికి - గుఱ్ఱముల కన్నింటికి సాహిణులు మువ్వురు. రెండు గుఱ్ఱములకు - రెంటికి గుఱ్ఱములకు - గుఱ్ఱములు రెండింటికి - గుఱ్ఱములకు రెండింటికి సాహిణులు నలుగురు. లక్ష గుఱ్ఱములకు - లక్షకు గుఱ్ఱములకు - గుఱ్ఱములు లక్షకు - గుఱ్ఱములకు లక్షకు - గుఱ్ఱములకు లక్షకు రవుతులు లక్ష - ఇత్యాదు లెఱుంగునది.