పుట:Atibalya vivaham.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము

37

అత్తగా రెంతమూర్ఖురా లయిన, ఈబాధ యంతయధికముగా నుండును. కొడు కేమైననుసరే కోడలిత్రాడు కోటిపల్లెరేవున త్రెంచినఁ జాలునని సంతోషించు అత్తలును మనదేశములో పలువురున్నారు. ఈ బాధలనుబట్టియే "అత్తపోఁగొట్టిన దడుడోటికుండ, కోడలుపోఁగొట్టి నది క్రొత్తకుండ" యనుసామెతయు, ఇటువంటివే మఱికొన్నిసామెతలును వెలసియున్నవి.

ఈ సుఖమంతయు నిట్లుండఁగా నీ బాలదంపతులకు లభించెడి యితరావస్థలను చిత్తగింపుఁడు. కాలము రాకమునుపె గర్భాదానమగుటచే కలిగిన సంతానము సాధారణముగా దుర్బలమయి పురిటిలో పోవువారును తరువాత కొంతకాల మాదంపతులకును బంధువులకును శ్రమ యిచ్చి పోవువారును అయి యుందురు; అంతటి భాగ్యమును వహింపక చిరకాలము కష్టముల ననుభవించుచు బ్రతుక నోచుకున్న బిడ్డలు చిడుము మొదలయిన వ్యాధులచేత చిక్కి దుర్బలమయన శుష్కదేహములు గలవారయి పెద్దవారయినప్పుడుసహిత మా బిడ్డలకు పుట్టినబిడ్డలు తాము తమకాలములో పురాణములయందు వర్ణింపఁ బడిన యంగుష్ఠమాత్రశరీరులను పుట్టింపఁ బ్రయత్నించుచున్నవారివలె నుందురు. ఆడుకోవలసినయవస్థలోనే బాలికలకు బిడ్డలు పుట్టుటచేత కూడ తల్లులు తిన్నగా పిల్లలను పెంచుటకు చేతఁగాక వారినిపాడుచేయుచున్నారు. బిడ్డలమాట యటుండఁగా బిడ్డలను గన్నతల్లులు తండ్రులు సహితము కొంతకాలములోనే శరీరపటుత్వము చెడిపడుచుతనములోనే ముసలివారయి యల్పాయుష్కు లగుచుందురు. రజస్వల యయినంతమాత్రముచేత కన్య సంభోగార్హురాలు గాదనియు, సమస్తావయవపరిపూర్తి యగుటకు మఱికొన్నిసంవత్సరములు జరగవలె ననియి, ఈలోపల వధువరులను కలిపినయెడల వారిదేహములు చెడి రోగాశ్రయము లగుటయేకాక వారికి పుట్టినబిడ్డలును చెడుదు