పుట:Atibalya vivaham.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రనియు వైద్యశాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విధముగా బాల్యవివాహమువలన సుఖము కలుగకపోవుటయేగాక వివాహము లేనియెడల దృఢకాయులయి చిరకాలము జీవింపఁదగిన దంపతులయాయువుకూడ సన్నమగుచున్నది. మఱియు బాల్యవివాహమువలన బాలికయొక్క చదువుమాత్రమే కాక బాలయొర్తయొక్క చదువుకూడ చెడిపోవుచున్నది. సంసారదు:ఖములు లేక స్వేచ్ఛగా బ్రతుకవలసిన బాల్యదశలోనే సంసారము వచ్చి మీఁద పడుటచేత చదువుతోఁచక, ఇంటనొక మూల తల్లిదండ్రులును మఱియొకమూల నాలుబిడ్డలును ద్రవ్యార్జనము కుటుంబభరణము చేయుమని నిత్యమును పోరుచుండఁగానుద్యోగము నిమిత్తమయి యీబాలుఁడు కృషిచేయవలసినవాఁడుకాక యెటుండఁ గలఁడు? మన మెఱిఁగినవారిలోనే యెందఱు బాలురు మిక్కిలి తెలివిగలవారయ్యును గొప్పపరీక్షలం గృతార్థులయి యున్నత స్థితికి రాఁదగిన బుద్ధిసంపద గలవారయ్యును సంసారభారము మీఁద పడుటచేత నడుమ చదువు విడిచిపెట్టి భావిమహాఫలములను చెడగొట్టుకోవలసినవా రగుచున్నారు కారు? ఎందఱు బాలురు తమ చిన్న భార్యనింట నొంటిగా విడిచి రా వలనుపడక యత్యల్ప దూరములోనున్న శాస్త్ర పాఠశాలలకు సహితము పోయి చదువుకో లేక చదువునం దెంత యాసక్తిగలవారయినను కార్యము లేక చిన్న పనులతోనే తృప్తి పొందవలసినవా రగుచున్నారు కారు? ఒక్క విద్యాభివృద్ధిమాత్రమే కాక సమస్తాభివృద్ధులకును బాల్యవివాహము ప్రతిబంధకముగా నున్నది. వివాహమైనతోడనే తరుచుగా బాలికలను పాఠశాలలనుండి మాన్పించుచున్నారు. ఇదిగాక యీ బాల్యవివాహమువలన చిన్నతనములోనే సంతానము గలిగి వారు పోషేంపలేనియవస్థలోనే కుటుంబములు పెరుగుచుండుటచేతను వారి వివాహముల నిమిత్తమయి కులాచారానుసారముగా విశేషవితమును