పుట:Andhrulacharitramu-part3.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖాను సుల్తానునకుం జెప్పెను. ఈవిషయమును గూర్చి సుల్తాను మొట్ట మొదట పెడచెవి బెట్టి విని యుండెను గాని తరువాత వారు తనపట్ల మన:పూర్వకమైన విధేయత కలిగి యున్నవారని తెలిసికొని మహమ్మదుషాహ తనరాజ్యమునకును వారి రాజ్యమునకును నడుమ నున్న గోలకొండదుర్గము సరిహద్దుగా నుండవలెననియు, ఎంతకాలము తెలుగువారు తమ్మును తమ యధికారమును ధిక్కరించకుండ నుందురో యంతకాలము దానుగాని తనతరువాతరాజ్యమునకు వచ్చువారుగాని వారిని నవమానింపరాదనియు, తానుపెట్టినహద్దు నతిక్రమింపరాదనియు నిబంధన నేర్పఱచి తానే కాగితమును వ్రాసి ముద్రవేసి మంత్రుల కీయవారు లాకాగితమును తెలుగురాయబారి కొసంగిరి. అతడు తాను జేసినవాగ్దత్తముప్రకారము డిల్లీచక్రవర్తికి సమర్పింప నెంచి రత్నసింహాసనమును మహమ్మదుషాహకు సమర్పించియతనియొద్ద సెలవుంగైకొనిరాజశైలమునకు మరలివచ్చెను.