పుట:AndhraRachaitaluVol1.djvu/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న తనమున మన కృష్ణారావుగారికి సంస్కృతాంధ్రములు, ఆంగ్లము నొకగురువునుంచి తల్లిగా రింటికడనే చెప్పించిరి. పిమ్మట రాజమహేంద్రవరము చదువునకు విడువలేక కుమారుని పంపిరి. అక్కడ నుండి మనప్రభుకిశోరుడు శ్రద్ధగ జదివి 1887 లో బ్రవేశపరీక్ష 'మెట్రిక్యులేషన్‌ ఎగ్జామినేషన్‌' యం దుత్తీర్ణు డయ్యెను. గణితమందును, భాషావిషయమందును మొదటినుండియు వీరికి బట్టుదల హెచ్చు. 1888 లో రాజమహేంద్రవర కళాశాలలో ఎఫ్.ఏ. చదువుట కుపక్రమించిరి. కాని, కాలకర్మవశమున దల్లి కామాయమ్మగారు కాలధర్మమందుటయు, కృష్ణారావుగారి దత్తత చెల్లదగినది కాదని యెవరో యభియోగములకు దిగుటయు, ఆయా చిక్కులు తటస్థించుటచే మనోవైకల్యము కలిగి వ్యాధిబాధ కలుగుటయు గారణములుగ మూడేండ్ల దాక విద్యాభ్యాసము సాగినదికాదు. 1891 వ యేటి చివర వ్యవహారములెల్ల సానుకూలముగ బరిష్కరింపబడి కృష్ణారావుగారికి మరల చదువుపై నభిలాష పెంచినవి. చెన్నపురి క్రైస్తవకళాశాలలో బ్రవేశించి 1893 లో ఏఫ్.ఏ.యందు నెగ్గి 1896 నాటికి బట్టభద్రులైరి. దేశచరిత్రలయందును బట్టము నందగోరి 1900 లో జరితార్థులైరి. కృష్ణారావుగారు పట్టభద్రులైన తరువాత 'కాకినాడ' లో మేడకట్టించుకొని యుండి సంస్థానమును స్వయముగ బరిపాలించుకొనుచు నుండిరి. అక్కడనుండి పోలవరము జమీందారుగారి పేరు పతాకనెత్తినది.

ఈయన దేశచరిత్రమందు మేరలేని యభిమానము కలవాడగుట భారతదేశ సంచారము గావించి ప్రధాన పట్టణముల నన్నియు జూచి చారిత్రకముగ నాయావిశేషములెల్ల గనిపట్టెను. ఇంకను బెద్దచదువేదో చదివికొందమని యింగ్లండుదేశమునకు బ్రయాణముకట్టెను గాని, దైవికముగా గారణాంతరములచే నది చేకూరలేదు. భారతస్వాతంత్ర్య సంపాదనమునకు నడుముకట్టిన సంఘములతో నీయన చెలికారము చేసెను.