పుట:Andhra-Bhashabhushanamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxi

వ్యాకరణసంప్రదాయము ననుసరించి పరిశీలించినయెడల "లంజికా" "మల్లికా" అను సంస్కృతరూపములకు వరుసగా "లంజిఆ" "మల్లిఆ" అని ప్రాకృతరూపములు గలుగును. వానికిఁ దెనుఁగుసంప్రదాయమున "లంజియ" "మల్లియ" అనురూపము లవతరించినవి. వానికి ఎదంతత్వ మంగీకరింప లంజె, మల్లె అనురూపములు సిద్ధించినవి. ఇది వైయాకరణప్రక్రియ. వానిసామ్యము ననుసరించి మరి కొన్ని శబ్దము లాగణమునఁ జేరినవి. కేతన ప్రక్రియకంటెఁ జింతామణిప్రక్రియ ఈవిషయమున శాస్త్రసంప్రదాయానుసారము. అది కేతన చూచియున్నచో ఈ ప్రక్రియనే యనుసరించియుండును. అది యాతనికి నచ్చనిచో ఖండించి తనమతమునకుఁ బ్రాశస్త్యము స్థాపించియుండును. అది నన్నయభట్టమతమనిగాని నన్నయవ్యాకరణమనిగాని తెలిసినచో నెత్తిమీఁదఁ బెట్టుకొనును. ఇట్టివిషయము లెన్నియోగలవు. విమర్శకులు గ్రహింతురుగాక. చింతామణి చూచియున్నయెడలఁ గేతనకు నంత యతిసంక్షేపముగా వ్యాకరణము రచింప బుద్ధి పుట్టునా? కేతన వ్యాకరణమున మనము గ్రహింపఁదగిన ప్రాచీనసిద్ధాంతము లెన్నియో గలవు. మచ్చున కొకటి చూపెదను. ప్రథమమీఁది కచటతపలకు, గసడదవలు వచ్చుట వికల్పమనియు; తాను, నేను,