పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనరమ: చెల్లీ, రతీదేవి! నీవింకా యోగినీ హృదయంతో ఈలా తపస్సు చేసుకోవడం మంచిదికాదు. మన్మథదేవులే స్వయంగా వచ్చి నిన్ను అర్థిస్తున్నారు.

బాలికలు: అవునుదేవీ, శుభముహూర్తం దాటి పోతున్నది.

బాలురు: వసంతకాలం నిత్యమైనా క్షణికం. మాకింతలో కౌమారదశ వస్తుందన్న భయం ఆవరిస్తున్నది.

శాంతిశ్రీ రాకుమారి వెలవెలబోయే చూపులతో వీరందరినీ కలియ జూచింది.

21

శాంతిశ్రీ మోము చూస్తూ బ్రహ్మదత్తుడు క్రుంగిపోయాడు. ఈ బాలికను తాను ప్రేమించినాడు. ఈ బాలికే తన ఆత్మేశ్వరి! ఈ ప్రణయరహిత హృదయ, ఈ జన్మయోగిని, తన ప్రేమ నిధానము. ఇంత లోకోత్తర సౌందర్యవతి అయిన ఈమె జీవితంలో ప్రేమరసార్ధత లేనేలేదే! తేనెలేని పుష్పమా ఈమె! ఈమెకు భగవద్భావంకూడా లేదా! ఇది ఈమెలో దోషమా లేక అవస్థా దోషమా? తాను ఈ బాలికను రతీదేవిగా ఎన్నుకొని ధర్మద్రోహము చేసినాడా? ధర్మజ్ఞుడయ్యూ తాను ఈ విషయంలో ఇంత ధర్మగ్లాని ఒనర్చినాడేమి? వైరాగ్యాభిరతమగు తన హృదయంలో స్త్రీ కాంక్ష అంతరాంతరాలలో అణిగి ఉన్నదా? స్త్రీ పురుష సంయోగము దుష్టమని పరిత్యజించ దగినదా? బ్రహ్మదత్తుని ఆలోచనా నిమగ్నత గమనించిన ఆ యువతీ యువకులు చుటుక్కున నిశ్శబ్దత వహించారు.

శాంతిశ్రీ రాకుమారి బ్రహ్మదత్తుని గమనించింది. బ్రహ్మదత్తుని మోము నిశ్చలత వహించింది. అతని మోము శీతకాలాన హిమాలయ శిఖర రూపం తాల్చింది. అతని మోము సంపూర్ణామవాస్య రాత్రి నిశ్చిలాకాశంలోని గంభీరత వహించింది.

“శాంతిశ్రీ రాకుమారీ! నన్ను క్షమించు. నీ దివ్య సౌందర్యానికి నేను ముగ్ధుడనయి నిన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాను. ఆకాశాన్ని ఆడుకొనేందుకు కావాలని పోరుపెట్టిన బాలకుణ్ణి నేను.”

"ఆర్యా! నేనే క్షంత్రవ్యురాలిని. మీ యందు దోషమేముందీ? మిమ్మీ యువతీ యువకులు మన్మథునిగా ఎన్నుకొన్నారు. నన్ను మీరు ఎన్నుకొన్నారు.”

ఆమె మాటలలో, ఆశ్చర్యముగాని, కోపముగాని, దయగాని, ఆనందముగాని, హాస్యముగాని, విచారముగాని ఏమీలేదు. ఆమె మాటలు ఆకాశవాణి మాటలులా ఉన్నాయి.

“రాజకుమారీ! ఇందులో నీదోషమూ లేదు. నాదోషమూ లేదు. వీరందరి దోషమూలేదు. విధిదీ, కాలముదీ దోషం. సెలవు.” బ్రహ్మదత్తుడు తలవంచుకొని విసవిస నడిచి తన రథము కడకుబోయి తానే తన గుఱ్ఱములు రథానికిపూన్చి విజయపురంవైపు వెళ్ళిపోయాడు.

అతడు వెళ్లిపోవడం చూస్తున్న శాంతిశ్రీ ఏమీ ఆశ్చర్యం పొందలేదు. ఈ యువకుడు అలా వెళ్లి పోయినాడేమిటి? ఆమె శాస్త్రప్రకారం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులంటే ఏమిటో తెలుసుకొన్నది. కాని వాని అనుభవం ఆ బాలకేమి తెలుసు? కొలదిగా విసుగు రావడం. ఎక్కడో మనసు లోతులలో కొంచెం కృతజ్ఞత. ఆ లోతులకు

అడివి బాపిరాజు రచనలు - 6

51

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)