పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మ: సులభమే. కానివ్వండి. చక్రవర్తి వారసుడైన ఒక రాజకుమారుని మనం ధర్మపరంగా ఏమిచేయగలం? అతడు మంచివాడైతే పూజార్హుడే! కాక రాజద్రోహం సలుపడానికి కుట్రలుచేస్తే భయంకర ధర్మగ్లాని అవుతుంది. ఆతడు శిక్షార్హుడు.

వీరపురుష: తమ ఆలోచన బాగున్నది.

బ్రహ్మ: ఈ విషయం చక్రవర్తికి తెలియునా?

స్కందశ్రీ: చక్రవర్తి చాలా జబ్బుగా ఉన్నారు. అందుచే తెలియనీయలేదట.

బ్రహ్మ: చిత్తం నేను వెంటనే మన అపసర్పులలో దిట్టలను ముసిక నగరం పంపి పులిమావి శాతవాహన ప్రభువు అక్కడ ఏమిచేస్తున్నదీ తెలిసికొంటాను.

మహారాజు: ధనక ప్రభు! మీరు వెంటనే మన సైన్యాలను ఆయత్తం చేయించి ఉంచండి. ఏ సమయానికి మనం యుద్ధాభిముఖులం కావలసివస్తుందో?

మహారాజు లేవగానే, మంత్రులు, సామంతులు, మహారాజకుమారులు లేచినారు.

13

విష్ణునాధుని, సరస్వతిని, స్కందుని, బుద్ధదేవుని, విష్ణుని, శివుని పూజించి బ్రహ్మదత్తప్రభువు శాంతిశ్రీ రాజకుమారికి చదువు ప్రారంభించారు. ఆమె కీచదువుపై, ఈ గురువుపై భక్తిలేదు. తల్లిదండ్రుల ఆజ్ఞలను ఉల్లంఘించ కూడదన్న నియమమే ఆమె నీ చదువుకు ఒప్పింపచేసింది. మహారాజ కుమారికి చదువు చెప్పేటప్పుడు ఆమె చెలులు ముగ్గురు దగ్గరనే ఉన్నారు.

స్కందవిశాఖాయనక ప్రభువు ఆరంభమందే ఆత్మ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు.

“స్వామీ! ఆత్మ అంటే ఉపనిషన్మత ప్రకారం సత్ పదార్ధము. తక్కినవన్నీ ఆ పదార్థానికి అభాసలు.”

“బౌద్దధర్మ ప్రకారం ఆత్మ ఉన్నదా?”

“బౌద్దంలో ఆత్మ సత్యము కాదు.”

“బౌద్ధధర్మంలో సత్ పదార్థమేది?”

“బౌధంలో రెండు సంప్రదాయాలున్నాయి. హీనయానమునందు పురుష వ్యక్తిని తెలియజేసేది ఆత్మ. దీనిని మహాస్థ విరవాదమంటారు. వ్యక్తులు తమ నిర్మాణం తాము చూచుకోవాలి. ఈవాదంలో మహాసాంఘికులు మానవ సంఘానికంతకూ విముక్తి తీసుకురావాలంటారు. ఈ సాంఘిక వాదంలో ముక్తి సత్యం, బుద్దుడు శాశ్వతుడు.”

“ప్రథమావాదంలో బుద్ధు డెట్టివాడు?”

“ఆ వాదంలో సంయుకీ సంబుద్దుడు అలౌకిక పురుషుడుమాత్రం.”

“మహా సాంఘికవాదంలో రెండు శాశ్వాతపదార్థములు ఉన్నట్లు తేలుతోంది కదా. రెండు శాత్వతములు విశ్వంలో ఏలా ఇముడుతాయి?”

“ఆ రెండూ ఒక సత్తునే చెప్పుతవి.”

“సత్ భావన ఏలాంటిది?”

అడివి బాపిరాజు రచనలు - 6

37

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)