పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“బుద్దుడే పరమసత్యం.”

“మహాయానంలో బౌద్ద త్రిరత్నాలకు ప్రాముఖ్యం ఉన్నది. ధర్మ, బుద్ధ, సంఘాలు మూడు త్రిరత్నాలు.”

“అవును.”

“అందులో ధర్మము సత్ అనిన్నీ, అదే ప్రజ్ఞ అనిన్నీ, ఆ ప్రజ్ఞను సంపాదించుకొనే ఉపాయమే బుద్దుడనీ చెప్పుతారు. ధర్మం శాశ్వతమంటే ధర్మాచరణం చేసే పురుషుడూ శాశ్వతుడు కావాలికదా! పురషుడు దేహం వీడితే ధర్మమేమయింది? ధర్మంచేత వాడేమయినాడు?”

“ధర్మం ఎప్పుడూ ఉంటుంది.”

“అధర్మమో?”

“అశాశ్వతము.”

“అహింసాది ధర్మాలు సాపేక్షములు కదా, సాపేక్షవలన గుణమత్త ఏర్పడుతుంది కదా, ధర్మానికి?”

“ధర్మం గుణయుక్తమే.”

“గుణములు శాశ్వతమా?”

“సద్గుణములు శాశ్వతములు.”

“ఆ సత్ గుణములు అశాశ్వతములని ఏర్పడుతుంది. వెలుగు శాశ్వతమై, చీకటి అశాశ్వతమెలా అవుతుంది? చీకటి అనేది వెలుగు యొక్క అభావమే కదా? ఈ ద్వంద్వాలలో ఒకటి శాశ్వతమై రెండోది అశాశ్వతమెలా అవుతుంది?”

ఈ విధంగా బ్రహ్మదత్తుడు చదువు ప్రారంభించాడు. శాంతిశ్రీ నిశ్చలతతో తొణకని నిర్మలతతో ప్రత్యుత్తరాలు ఇస్తున్నది. బ్రహ్మదత్తుని అఖండ శేముషి శాంతిశ్రీకి పూర్తిగా తెలియును. అయినా ఆమె ఇసుమంత కూడా చకితహృదయ కాలేదు. చెక్కిన విగ్రహంలా ఆమె శిష్యపీఠంపై గురువున కెదురుగా అధివసించి ఉంది.

శిష్యులు ప్రశ్నించటం ఆచార్యులు ఉపదేశించడం సాధారణ విధానం. కాని ఈ విచిత్రమైన విద్యాభ్యాసంలో గురువే పృచ్ఛచేయడం శిష్యురాలు ప్రత్యుత్తరాలు ఇవ్వడం జరిగింది. ప్రథమదినం పూజలైన తర్వాత రెండు ఘటికలు మాత్రమే బ్రహ్మదత్త ప్రభువు శాంతిశ్రీతో చర్చించినాడు.

“రాజకుమారీ! నేను సెలవు తీసుకుంటాను.”

"చిత్తం, స్కందవిశాఖాయనక ప్రభూ!”

అంతే. ఆ వెనుక బ్రహ్మదత్తుడు వెడలిపోయినాడు. బ్రహ్మదత్త ప్రభువు నగరి వెనుక ఉపవనం ఉంది. ఆ తోటమధ్య శిల్పసౌందర్య విలసితమైన బ్రహ్మ విద్యాశ్రమం ఉంది. దేశదేశాలనుండి ఈ బ్రాహ్మణ క్షత్రియుని పాదాలకడ ఆర్షవిద్యలు నేర్చుకొనడానికి పండితులూ, విద్యాప్రియులూ, కళావేత్తలూ వస్తూ ఉంటారు. ఈ విద్యాశ్రమానికి బ్రహ్మదత్త ప్రభువు కులపతి. వీరు కాక వివిధ విద్యాసాగరులైన మహాపండితు లనేకులు విద్యా గురువులుగా ఆ ఆశ్రమంలో ఉన్నారు. కాని ఇంతవరకు బ్రహ్మదత్తుడు ఒక్క

అడివి బాపిరాజు రచనలు - 6

38

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)