పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ బాల భిక్కుని కావాలని సంకల్పము పూనినదంటారు. ఆమె హృదయంలో కామగంధము లేదట. తల్లిదండ్రులన్నా ప్రేమలేదట. వారియెడ గౌరవంతో సంచరిస్తుందట. ఆమె హృదయం శుద్దశూన్యం, తెల్లటి రాయి అంటారు. కాని ఆమె స్వభావము సాత్వికమట. రాతి హృదయానికి సాత్విక గుణమెలా అలవడుతుంది? శుద్ధసత్వంకూడా తమస్సులా కనిపిస్తుంది. అంతే. ఓహో ఏమి అందం! అలౌకికమా సౌందర్యం. ఆ పరమసుందరికి తాను యువకుడు, అవివాహితుడు ఎలా చదువు చెప్పడం?

ఆ సమయంలో తోటమాలి పరుగునవచ్చి, బ్రహ్మదత్తప్రభువు కడ మోకరించి, “ప్రభూ, శ్రీ మహారాజులవారి కడనుండి కంచుకి వచ్చి తమ దర్శనము అపేక్షిస్తున్నారు” అని మనవి చేసుకొన్నాడు.

“అలాగా! వెంటనే ప్రవేశ పెట్టు.”

కంచుకివచ్చి బ్రహ్మదత్తునికి నమస్కరించి, “ప్రభూ! మహారాజుల వారికి ధాన్యకటకంనుండి గజవార్త వచ్చింది, తమ్ము వెంటనే ఆలోచనా మందిరానికి రమ్మన్నారు. అక్కడనే పూంగీయ స్కందశ్రీమహాప్రభువూ ఉన్నారు. శ్రీమహారాజకుమారులవారూ అచ్చటనే ఉన్నారు” అని మనవి చేసినాడు.

“సరే నేనూ వస్తున్నాను” అని బ్రహ్మదత్తప్రభువు లేచి తన వీపున వ్రేలాడు శంఖంతీసి “భోం, భోం” అని ఊదినాడు. ఆ వెంటనే రథాన్ని తోలుకొని సూతు డక్కడకు వచ్చినాడు. బ్రహ్మదత్తప్రభువు రథారోహణం చేయగానే ఆ రెండు గుఱ్ఱాలూ వాయువేగంతో విజయపురంవైపు సాగినాయి. కన్నుమూసి తెరిచేలోపల రాచకోట వచ్చినది. కోటగోపుర ద్వారం దాటి, రథం రాజభవనం సమీపించి, ఆగిపోయినది. వెంటనే బ్రహ్మదత్తుడు రథావతరణంచేసి మృగరాజువలె లోనికి నడిచిపోయినాడు. మహాకంచుకి ఉత్తమాజానేయ మధివసించి రథము వెంటనే వచ్చి, బ్రహ్మదత్త ప్రభువు రథావతరణ చేయకమునుపే గుఱ్ఱం దిగి, అచ్చట ఉన్న సారధికి కళైమందిచ్చినాడు. వారిరువురు సమాలోచన మందిరానికి వెళ్ళిపోయినారు. బ్రహ్మదత్తుడు మహారాజునకు స్కందశ్రీ ప్రభువునకు నమస్కరించినాడు. మహారాజ కుమారుడు వీరపురుషదత్త ప్రభువు లేచి బ్రహ్మదత్తునకు నమస్కరించినాడు. బ్రహ్మదత్త ప్రభువు మహారాజకుమారుడూ ఆసనాలధివసించినారు.

మహారాజు: బ్రహ్మదత్త ప్రభూ! పులమావి ప్రభువు తాను ముసిక నగర రాజప్రతినిధి అయినా ధాన్యకటకంలోనే ఉంటున్నాడుకదా! ఈ మధ్య ఆతని కుట్రలెక్కువ కాగా, సార్వభౌములు పులమావిప్రభువును ధాన్యకటకం వదలిపోవద్దని ఆజ్ఞ ఇచ్చినారు. ఆలాంటి సమయంలో నిన్న రాత్రి అతడు ముసికనగరం ప్రయాణమై పోయినాడట.

బ్రహ్మదత్తు: ఈ వార్త పంపించింది ఎవరు మహాప్రభూ?

స్కందశ్రీ: మహామంత్రి శివశ్రీ పంపించినారు.

బ్రహ్మ: మహాప్రభూ! పులమావిని ముసిక నగరమే వెళ్ళనీయండి. ధాన్యకటకంలో ఉండి కుట్రలు చేయడంకన్న మనకు దూరంగా ఉండడము ఉత్తమం కాదా?

వీరపురుష: బ్రహ్మదత్తప్రభూ! ముసికలో ఉంటే పులమావికి ఇతరులతో కలవడం సులభం కాదా?

అడివి బాపిరాజు రచనలు - 6

36

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)