పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాల: కావున లోపల లొటారము పైకి బటారముగ పిష్టపురము సిద్దమైనదా మహారాజా?

కుబ్జ: ఈ కోటను జేరవచ్చిన వారును, ఒకరి మంత్రాంగ మింకొకరు ఎరుగకయే యిచ్చటకు వచ్చిరి. కాని, యిట వారు కలుసుకొనునట్లు పాయములుపన్ని పంపినాను.

కాలకంపన ప్రభువును వారి కుమారుడు జయనందియు పొందిన యాశ్చర్య మపారము.

అప్పుడు కుబ్జ విషువర్ధనుడు “కంపనప్రభూ! ఒక పక్షము దినములు మన సైన్యములను విశ్రాంతి తీసికొననిండు. ఈ రాష్ట్ర ప్రజలు విష్ణువర్థన చాళుక్యు నుత్తమ పరిపాలన మెట్టిదో చవిచూచెదరు గాక" యని మందహాసవదనుడై పలికెను.

“ఈ లోన శత్రువులు బలమును కూడదీసికొనరా మహాప్రభూ?”

“అటుల నగుటయే ఉత్తమముకాదా కంపనప్రభూ! యుద్ధనీతి ద్వివిధము. విగ్రహమున శత్రురాజుల నందరిని చీలదీసి వేరువేరుగా నొకరొకరిని నాశనము సేయు టొక విధానము. శత్రువు లందరను నేకముగావచ్చి, అప్పుడు వారితో దలపడి శత్రుని శ్శేషము సల్పుట రెండవ విధానము!

“మొదటి విధానము సులభమును ఉత్తమము గాదా మహాప్రభూ!”

“నూతన రాజ్యము స్థాపించునాడు రెండవది మహోత్తమము. అట్లుకానిచో, శత్రునిశ్శేషము జరుగక, మఱల మఱల గుట్రలు తలయెత్తుచుండును. విడివిడిగా నోడిపోయిన శత్రువులు మనమందరము గలిసినచో, విజయము మనదే యై యుండెడిదని యాలోచించుకొందురు. రాజ్యమున సంక్షోభములు తప్పవు.”

కాలకంపనుడు తన ప్రభువు యుద్ధనీతికి నాశ్చర్యమందెను. ఆ మరునాడు కుమార విష్ణువర్థన ప్రభువు నిండు పేరోలగంబున గొలువుతీర్చియుండ దీనవదనయగు నొక బాలిక సింహాసన వేదికా సోపానపాదపీఠకు కడకు పరుగిడి వచ్చి సాష్టాంగముపడి “దేవా! రక్షించుము! రక్షించుము!” అని యరచి, మూర్చపోయెను.

తమ కష్టముల నివేదించుకొనుటకు రాజదర్శనార్థ మెవరు రాఁదలచుకొన్నను వారికెట్టి యాటంక ముండరాదని విష్ణువర్ధను నాజ్ఞ. కాలకంపన ప్రభువు తన యాసనము నుండి దిగ్గునలేచి, యా బాలికకడకు బోయి, మోకరించి “బాలిక మూర్ఛపోయినది. మహాప్రభూ!” యని విన్నవించి వెంటనే పన్నీరము కొనిరండని దౌవారికుల కాజ్ఞయిచ్చెను.

విష్ణువర్ధనుని చిన్నతనము నుండియు బెంచినవారిలో నొకడగు రాజవైద్యు డింతలో నచటకు వచ్చి, యా బాలిక ననాయాసమున నెత్తుకొని, రాజసభామందిరమునకు వెనుక నున్న యాలోచనా మందిరమునకు గొంపోయి, యచట నొక మంచాసనముపై బరుండబెట్టి నాడి పరీక్ష సేయు చుండెను. వైద్యుని వెనుకనే విష్ణువర్ధనుడు కాలకంపన ప్రభువును వచ్చిరి. పన్నీరులు గొని పరిచారికలును వచ్చి చేరిరి.

“మహాప్రభూ! బాలిక మూర్చపోయినది. అదిగో! యామెకు మెలకువ వచ్చినది. ఒక కలికమును బెట్టెదను. అంతలో నీమెకు పూర్తిగ మెలకువ వచ్చి యధాస్థితి నందు” నని ఆ వైద్యుడు విష్ణువర్ధనునితో విన్నవించుచు కలికము బెట్టెను. “ఆ! ఆ!” యని యా బాలిక యొక్కసారిగా లేచి కూరుచున్నది.

అడివి బాపిరాజు రచనలు - 6 • 254 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)