పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాణాసంచులు వెలుగ నారంభించినవి. ఎడ్లులేని బండ్లు మరియు దగ్గరకు వచ్చినవి. రాళ్ళగట్టిన నిచ్చెనత్రాళ్ళను యంత్రములద్వారా చాళుక్యసైనికులు కోటగోడలపైకి విసిరి వైచిరి. పృధ్వీమహారాజు సైన్యములుగాని, కళింగ సైన్యములుగాని, కోటగోడల నుండి, యా వచ్చు బండ్లపైన నెన్నియస్త్ర ప్రయోగములు చేసినను ప్రయోజనము లేకపోయినది. శత్రువులు పూర్తిగ నగరము నాక్రమించిరని నినాదములు బయలు వెడలినవి.

రాచకోట ముందు నేనుగు నెక్కిన పృధ్వీమహారాజు చుట్టును చాళుక్యసైన్యములు క్రమ్ముకొన్నవి. తన యుత్తమ ధవళాజానేయము నెక్కి చాళుక్యవిష్ణువర్ధను డెదుట ప్రత్యక్షమైనాడు. వచ్చుటయేమి, యా పిశాచపు బొట్టవాడింద్రుని వజ్రాయుధమువంటి బాణమును ప్రయోగించినాడు. అది చువ్వున వచ్చి, పృధ్వీమహారాజు కుడిభుజమున నాటుకొని పోయినది. ఇవి సూదులని హేళనచేసి తినే యని అనుకొనుచు నా అంబారి పైననే ఆ రాజు త్రెళ్ళిపడిపోయినాడు. ఆతని సైన్యము లెక్కడి వక్కడ చాళుక్య సైన్యములకు లోబడిపోయెను.

11

పిష్టపురము వశమయిన వెనుక చాళుక్యవిష్ణువర్థనుడు ఆ నగరమంతయు మరల బాగుచేయించుటకును, కృత్రిమాగ్నులచే, ముట్టడిచే నష్టపడిన ప్రజలకు పరిహార మిప్పించుటకును, కాలకంపన ప్రభువునకు అనుమతి నిచ్చెను. తన సైనికులకు బహుమానము లిచ్చి, వారిని తృప్తిపరచెను.

ఒకనాడు విష్ణువర్ధనుడు ఆలోచనామందిరమున సింహాసన మధివసించి యుండెను. అప్పుడు కాలకంపన ప్రభువును జయనందియు సమీపించి “మహాప్రభూ! శత్రువుల చిత్తై కాగ్రతను ఎట్లు భేదించగలిగినారో, నా కిప్పటికీ అర్థము గాలేదు” అని, వినయముగ బ్రశ్నించినారు.

విష్ణువర్ధనుడు నవ్వుచు జయనందితో, “ఓయి వెఱ్ఱివాడా! నేను వాతాపి నగరము నుండి బయలుదేరినప్పుడు పిష్టపురదుర్గ వ్యవహారము నేమియు నెఱుగక బయలు దేరితి నను కొంటివా! అన్నగారు ఈ దుర్గమ దుర్గమును బట్టలేదా! అన్నగారి సేనాధిపతుల కీ కోటసంగతి పూర్తిగ దెలియదా! ఈ దుర్గమునందున్న ప్రత్యంగుళ భాగమును, అందలి రహస్యము లన్నింటిని, మున్నే తెలిసికొంటిని. అన్నగారు బహు పరాక్రమముచే దీనిం గెలిచిరి. నేను గంభీర రహస్యోపాయముచే దీని సాధింపదలచితిని. వాతాపినగరమునుండి సైన్యములతో యుద్దయాత్ర సాగించుటకు మున్నే వేవురు జైన సన్యాసులు, నాలుగు వేల భిక్షకులు, రెండుమూడు వేల పల్లె ప్రజలు వచ్చిరి. ఒక వేయిమంది వర్తకులు, మూడువేల గుఱ్ఱములగొని ఆస్మిక వణిజులటుల వచ్చిరి. వివిధ వేషములతో బదివేలమంది దిట్టరులైన మన సైనికులాయా వేషములతో నీ నగరమున వచ్చి చేరిరి. ఆటగాండ్రుగా దళవాయులు వచ్చిరి. తోలుబొమ్మల యాటకాండ్రుగా సేనాపతులు చేరిరి. శివదాసులుగా గూఢచారులు వచ్చియుండిరి. కొందరు విరోధుల సైనికులను మన పక్షమునకు ద్రిప్పివేసిరి. మన సైనికులు చాలామంది, పృధ్వీమహారాజు సైన్యములో జేరవచ్చినట్లు వచ్చిరి. అన్నగారితో చేసిన యుద్ధములో పిష్టపుర సైన్యము లెన్నియో మడిసినవి గదా!

అడివి బాపిరాజు రచనలు - 6

• 253 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)