పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోటలో నర్థరాత్రి భేరీ నినదించిన గడియకు పుర మధ్యమునఁ బెద్ద గగ్గోలు బయలుదేరెను. నిదుర గూరిన ప్రజలందరు నొక్కసారి మేల్కొనిరి. అటనట కొన్ని యిండ్లంటుకొని పోయినవి. హాహాకారములు మిన్నుముట్టెను ఇంతలో శత్రువులు కోటలో బ్రవేశించిరను గందరగోళము నగరమంతయుఁబ్రాకిపోయినది. కోట గోడలపై నచ్చటచ్చట “శత్రువులు ప్రవేశించినారు, శత్రువులు ప్రవేశించినా” రనుకేకలు రణభేరీ నినాదములు నొక్కుమ్మడిగ నుద్భవించినవి. ఎక్కడేమి జరుగుచున్నదియు నేరికిని దెలియలేదు.

ఉన్నట్లుండి నగర పూర్వగోపుర మహాకవాటములు తెరుచుకొనిపోయినవి. ఆ ద్వారమున శత్రువు లాక్రమించి వారిని అక్కడకు దొందరపాటుగ వచ్చిన పృధ్వీమహారాజు కనుగొని మఱల వేగముగ వెనుకకు దానెక్కిన యశ్వమును పరుగెత్తించుచు రాజప్రసాద గోపురము కడకు జేరెను. ఈ సంక్షోభమునకుఁగారణ మేమైయుండునో యని తికమక పడుచు దన పట్టపుటేనుగు నెక్కబోవు పృధ్వీమహారాజునకు ఉపసేనాధిపతి తూర్పుద్వారము శత్రువుల వశమయ్యెనని మనవి చేసినాడు. కోటగోడలపైన అమర్చిన శతఘ్ని యంత్రాదికముల నుపయోగించుడని యాజ్ఞ నిడువారైన లేకపోయిరి. శత్రువుల వైపునుండి యంత్రము నుపయోగించు రంగురంగుల బాణాసంచులు వచ్చి కోటగోడమీద సైనికులను, ముట్టడించువారికి స్పష్టముగ జూపుచున్నవి.

తూర్పు ద్వారమునుండి చాళుక్యసైనికులు తండోప తండములుగ కోటలోనికి గట్టుతెగిన ప్రవాహమువలె రా జొచ్చిరి. ఆ సైన్యమును నడుపుకొనుచు చాళుక్యవిష్ణువర్ధనుండు నారాయణహస్త వినిర్ముక్త చక్రములె, తూర్పు గోపురద్వారములను మూటిని దాటి నగరములోనికి వచ్చి పడెను. అతనితో సమముగ కేతనముధరించి అంగరక్షక దళాధిపతి బుద్దవర్మ వచ్చుచుండెను. “కుజ్జ విష్ణువర్ధనుడు! కుబ్జ విష్ణువర్ధనుడు!” అను నినాదములు మిన్నుముట్టగనే యాతని వేగము నడ్డగించువారుగూడ నాయుధములు విడిచి, జోహారు లొనర్చిరి.

ఇంతలో నుత్తర గోపురద్వారములు మూడును దెరచుకొని పోయినవి. అవియు చాళుక్య సైనికుల హస్తగతములైనవి. ఆ ద్వారములనుండి యేనుగులనడుపుకొనుచు సేనాధి పతి కాలకంపన ప్రభువు, లోనికి చొచ్చుకొని వచ్చినాడు.

యుద్ధప్రారంభమున గగ్గోలు బయలుదేరిన ప్రథమ క్షణములందు కోటగోడలమీది సైనికు లేమిచేయుటకును దోచక, మ్రాన్పడిపోయినను, శత్రువులమీదికి వారందు. బాటులోనున్నను, లేకపోయినను నగ్నిబాణములు గండశిలలు ప్రయోగింపసాగిరి.

చాళుక్యసైన్యములందుండి యెడ్లులేని బండ్లు వానియంతటనవే నడుచుచు వచ్చుచున్నట్లు, వానిలో మండు కాగడాల వెలుతురులో గోటగోడలమీది సైనికులకుగన్పడి యీవిచిత్ర మేమని వారు చూచుచుండగనే వానికి నాతిదూరమునశిలలు నగ్ని బాణములు విసరివేయు యంత్రములు వచ్చుచుండెను.

నగరములో గగ్గోలెక్కువైనది. లోపలనుండియే చాళుక్య సైనికులు కోటగోడలపై వచ్చి పడుచుండిరి. చాళుక్య సైనికులాక్రమించుకొన్న ప్రతి కుడ్య గోపురమునను రంగుల

అడివి బాపిరాజు రచనలు - 6

252

అంశుమతి (చారిత్రాత్మక నవల)