పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినను వెంటనే యావిన్నప మందికొనుటకుగాను మాధవవర్మ మహారాజు ధర్మ ఘంటిక నిట్లు మ్రోగించుట కేర్పాటు చేసినాఁడు. తన సామంతులందరును దన వలెనే యా విధాన మవలంబింప వలయును. తాను ధర్మపాలనమున నప్రమతుడు. ఈ రీతినీ బూర్వ ప్రభువు లనేకులు ధర్మపాలన చేయుచుండిరట.

నే డా ఘంటానినాద మొక్కసారిగ సభయంతట మారుమ్రోగగనే, సభాభవనము చిటుక్కున నిశ్శబ్దత వహించినది. ఘంటమ్రోగుచునేయున్నది. మాధవవర్మ మహారాజు సింహాసనమునుండి లేచినాడు. సభయంతయు లేచినది. సింహాసన వితర్దికా సోపానముల నుండి దిగి, మహారాజు విసవిస నడచుచు సభా సింహద్వారము దాటి, ధర్మఘంటికా మంటపముకడ నిల్చినాడు. “ధర్మమును నిలబెట్టు”మన్నట్లా ఘంట మ్రోగుచుండెను ఎత్తిన తల దించి, మాధవవర్మ మహాప్రభువు గోపురము దిక్కునకు నడచినాడు ప్రభువువెంట మహామంత్రి, అతని ననుసరించి సేనాపతులు, వారివెనుక రాయబారులు, మహారాజున కీవల నావల బండితులు, వారికిటునటు నంగరక్షకులు, అందరివెనుక తక్కువగల సభయంతయు నిలబడినది.

మహారాజు గోపురము దాటి భవన ముఖస్థలమునకు వచ్చెను. ఆ విశాల ప్రదేశమున వేలకువేలు ప్రజలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, శిశువులు, కన్నులనీరు నించుచు జేతులు జోడించి నిలచియున్నారు. ధర్మఘంటికా రజ్జువును బాగులు నుత్తమకులజయైన గోవొకటి నిలచియున్నది. ఆ గోవువెనుక రక్తసిక్తాంగమైన కోడెదూడ శవమును మోయుచున్న ఒక గృహస్థు నిలచియున్నాడు. మహాప్రభు వట్లునిలుచుండి, “ఏమిది గోమాతయే, త్రాటిని లాగుచుండుట! ఆ తల్లికేమి ధర్మహాని సంఘటిల్లినది? ఈ త్రాడులాగ నా గోమాత కెవ్వరు నేర్పిరి?” అని ప్రశ్నపరంపరల బ్రజలనుద్దేశించి పలికినాడు.

అప్పుడొక పెద్ద ముందుకు వచ్చి, “ఆ త్రాటిని లాగ నీ గోమాత కెవరును నేర్పలేదు మహాప్రభూ. ఈ యావు ఇచ్చటకు వచ్చుననియేని మే మనుకొనలేదు. ఈదూడ రథము క్రింద బడి ప్రాణము కోల్పోయినది. ఈ యావు పడిన బాధ వర్ణనాతీతము. ఇంతలో నాగోవు యజమాని వచ్చినాడు. ఈయా వుత్తమజాతిదని రోధించినాడు. తన కోడెదూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుంబము వారందరు అల్లారు ముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆ యజమాని పడువేదనను మేము చూడలేకపోతిమి. ఆతడా దూడకళేబరము నెత్తికొని తనయింటికి దీసికొపోవుచు 'దల్లీ! నందినీ! రా, అమ్మా! అని పిలిచినాడు. కాని యాలోచనాధీనవలె కదలినదికా దీయావు. ఇంతలో నీ గోమాత కోట కభిముఖియై రాసాగినది.

“ముందు నీ యావు. వెనక నా దూడ శవమును మోయుచు నా యజమాని,

అచ్చట జరిగిన దుస్సంఘటన జూడం జేరిన మేము, ఇటుల నాయావు దిరిగిన దిక్కునకు నడచుచు వెంట వచ్చితిమి. కోటగుమ్మము దాటి. అంతర్ద్వారము దాటి, యీ గోపురమునొద్ద నున్న ధర్మరజ్జువుకడ కీ తల్లి వచ్చి దానిని గ్రహించి లాగ నారంభించినది. జరిగిన వృత్తాంతమిది మహాప్రభూ!” యని విన్నవించినాడు.

అడవి బాపిరాజు రచనలు - 6

238

అంశుమతి (చారిత్రాత్మక నవల)