పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామధేను వంశమున బుట్టిన యా గోమాత మృదులమైన తన తేనెకన్నుల బ్రేమకాంతులు వెలిగిపోవ, ముట్టెతో దన వత్సమును బుణుకుచు, మందగమనమున నడచుచుండెను. ఇంతలో మహా ప్రళయమువలె రాజకుమారుని రథ మావీధి బడినది. ప్రజల గగ్గోలు, పరుగులు, కొందరు పడి దొరలి ప్రాణములు దక్కించుకొనుట, ఇట్లా వీధియంతయు నల్లకల్లోలమై పోవుచుండెను.

వేయి పిడుగుల పాటువలె ఘర్ఘరావములతో నా రథమువచ్చి మాయమైపోయెను. “అంబా” యని ఆ కోడెదూడ యరచుచు నేల పడియున్నది. దాని యొడలంతయు రక్తము చిమ్ముకొని వచ్చుచుండెను. వీపును బొట్టయు దెగి మాంసపుగండలు వెలువడియుండెను. “అంభా” యని యా వరచుచు గన్నుల నీరుగార నా దూడచుట్టు దిరుగ దొడగినది. ఆ గోమాత తన శిశువు గాయములనుండి స్రవించు, రక్తస్రావము నాప యత్నించును. తన బిడ్డను ముట్టెతో బైకెత్తి యధాపూర్వముగ నడిపింపజూచును. “అంభా” యని యరచును. తలయెత్తి రథము పోయిన దిక్కుజూచును. తన చుట్టును, పడిపోయిన తన దూడ చుట్టును జేరిన జన సమూహము వైపు దీనదృష్ణుల బరపును. ఆ నోరులేని సాధు జంతువు హృదయమున నేమోప్రళయము వచ్చిపడినది. “నా బిడ్డయిట్లు పడిపోయినదేమి? నా బిడ్డను లేవనెత్తి మఱల నడిపించువారు లేరా” యన్నట్లు “అంభా అంబాయని అరుచుచునేయున్నది.

ఆ దూడ యఱపు నంతకన్న నంతకన్న సన్నగిల జొచ్చినది. విలవిల కాళ్ళు తన్నుకొని, యాలేగ ప్రాణములు విడిచినది. గర్భనిర్భేద్యమగు మహారావము సలుపుచు నా గోపురంధ్రి యా లేగ ప్రక్కనే కూలబడిపోయినది.

(4)

ఆనాటి సమారాధన లన్నియు నిర్వర్తించి. తానును భోజనాదికము గావించుకొని, యొక ముహూర్తము విశ్రమించి, తృతీయ యామాంతమున దాను నివసించుచున్న సామంతుని కోటలోని సభాభవనమున శ్రీవిష్ణుకుండిన మాధవవర్మసార్వభౌముడు గొలువు దీరినాడు. సామంతులు నితర రాష్ట్రముల రాయబారులు పరివేష్టించి యున్నారు, వేద పారాయణ, ధర్మార్థ నిర్వచన, పురాణపఠన, కవిప్రశంసలయిన పిదప గాయకులు పాడిరి. ఆటకత్తెలాడిరి. మహామంత్రి యేవియో రాజకీయ విషయములు సార్వభౌమునితో మనవి చేయుచుండిరి.

ఆ సమయమున సభాప్రాంగణ మంటపమునందు ధర్మఘంటిక “ఖంగు” “ఖంగు” మని మ్రోగనారంభించెను. ఆ ధర్మ ఘంటికకుఁ గట్టిన రజ్జువు ధర్మస్తంభము మీదనుండి, ప్రాకార కుడ్యము మీదనుండి, సభాభవన గోపురము ప్రక్కగ వ్రేలాడుచుండును. రాజోద్యోగు లెవరైన నన్యాయము చేసినచో, ధర్మమునకు గానీ వాటిల్లినపుడు తనకు ధర్మము దయచేయింపవలసినదని యెవరైనను ప్రభువునకు ఆ ఘంటారావముచే విన్నవించు కొనవచ్చును.

ఆ విన్నపమునకు గాలనియమము లేదు. రాత్రియైన బగలైన బ్రభువు కొలువుదీరి యున్నను లేకపోయినను నా రాష్ట్ర ప్రభువులైనను, ఆతడు లేనిచో ఆ రాష్ట్ర రాజ ప్రతినిధి

అడవి బాపిరాజు రచనలు - 6

237

అంశుమతి (చారిత్రాత్మక నవల)