పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తి దిగ్విజయమొసర్చి, పల్లవుల జయించి, కృష్ణాతీరమున నుత్తమక్షేత్రముల నొకటియగు విజయవాటిక యందు సర్వమల్లికేశ్వరుని అర్చించుటకై సకుటుంబముగా విడిదిచేసి యుండెను. మహారాజున్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుకొనుచుండిరి.

ఎచ్చట జూచినను వీధినాటకములు, తోలుబొమ్మలు, పుణ్యకథా కాలక్షేపములును జరిగినవి. మహారాజు నగరవాసులకు బరిసర ప్రాంతవాసులకును గూడ పంచభక్ష్య పరమాన్నములు పెట్టించుచుండెను. ఇంటింట దోరణములు, వీధివీధుల నూరేగింపులును, దేవాలయముల, జైనాలయముల, బౌద్ధ సంఘారామముల దేవతల పూజలు, భిక్కుల యర్చనలు వైభవముగ జరుగుచుండెను. పానశాలలయందు వివిధ పరీమళయుక్తములు రుచ్యములునగు పానీయములను వివిధ మద్యములను సేనాధికారులు, నర్తకీబృంద నృత్య వినోదములయందును, మధుర సంగీత సమారోహముల యందును గాలము నానందమయ మొనర్చుకొనుచుండిరి.

యువరాజు బ్రహ్మణ్యుడును, ఉత్తమవ్రతుడే అయినను వీధినిర్ణీతమై కాబోలు, దేవాలయముల జరుగు బూజల బాల్గొనక, విలాస లాలసుడై పానగృహముల నుండి అనేకవర్ణములచే ధళధళలాడుననియు, వివిధ పరిమళములచే ఘుమఘుమలాడు చున్నవియు, జక్కని రుచులచే నోరూరించుననియు, మధురమత్తతచే నానందమును గల్గించుననియునగు నామద్యములందన భవనమూనకు దెప్పించుకొని యిష్టిజనముల గలసి యవి సేవించుచుండెను. రాజకుల మర్యాదలను మీఱి యాతడు భ్రష్టబుద్ది యయ్యెను.

ఒకనాడు యువరాజు దేవవర్మ తీక్షణమైన మద్యమును సేవించి యతిమత్తతతో లోకమును మరచి, రెండుత్తమాశ్వముల బూన్చిన తన విహార రథ మెక్కి సూతుని వెనుక నుండుమని తానే రథము నడుపుచు విహారాయత్త చిత్తుడై కన్నుమిన్నులు గానని మహావేగమున విజయవాటికా వీధుల బోసాగినాడు. అంగరక్షకులు లేరు. త్రోవలందు జన సమర్ధమును సర్దు నాశ్వికులు ముందులేరు. సూతుడు వెనుక నుండి “భద్రము మహాప్రభూ! భద్రము మహాప్రభూ!” యని యరచినను దేవవర్మ చెవి కెక్కుటలేదు.

దేవవర్మ యట్టహాసము చేయుచు, ప్రజలు భీతచిత్తులై హాహాకారములు సేయుచు భారిపోవుచుండ, మత్తుతో మఱియు నుప్పొంగి, కశిచే జురుక్కుమని యశ్వములకు రెండాఘాతము లంటించెను. ఆ యుత్తమాశ్వము లదలించుటయేని సహింపనివి. ఆ కులీనములు క్రోధముచే గట్టుతప్పి మహావేగముగ బరుగిడ జొచ్చెను. ఆ వేగమున కింకను బొంగి, “ఇంకను వేగ మింకను వేగ” మని ఆ యువరాజ జరవ జొచ్చెను.

రాజకుమారుని రథము పోవు వీధిలో పూంగీ రాష్ట్ర సంజాతయైన పెద్దజాతి యావు తనవత్సమును గలసి ఆలమందలతో గూడి నగర భావ్యా దేశమున బచ్చికబీళ్ళ మేసి, తిరిగి యజమాని యింటికి బోవుచుండెను. అందమైన యా కోడెదూడ తెల్లని కాంతులీనుచు గాళ్ళకు గట్టిన గజ్జెలు, మెడ నలంకరించిన చిఱుమువ్వలు మ్రోగుచుండ, గంతులిడుచు తల్లి కాళులసందున దూరుచు, జెంగున ముందు కురుకుచు బ్రక్కకురుకుచు దన చిన్న గంగడో లాలిపోవ దల్లితో నడుచుచుండెను.

అడవి బాపిరాజు రచనలు - 6

236

అంశుమతి (చారిత్రాత్మక నవల)