పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కుపెట్టాలి. వెనకశ్రేణివారు మోకాళ్ళపై నిలిచి బాణాలు ఎక్కుపెట్టాలి. ఆ వెనకశ్రేణివారు నిలుచుండి బాణాలు ఎక్కుపెట్టి, శత్రువు నూరు ధనువుల దూరాన ఉండగానే, భేరీలుమ్రోత సంకేతంగా బాణాలు వదలాలి. శత్రువు ఏబది ధనువులు వచ్చేవరకు ఈ మూడుశ్రేణుల వారూ బాణాలు వదులుతూనే ఉండాలి.

ఆజ్ఞల ప్రకారమే పులమావి సైన్యాలు నూరు ధనువుల దూరం రాగానే ఇక్ష్వాకు సైన్యాలు ఒక్కసారిగా లక్షలకొలదిబాణాలు శత్రువులపై వదలినవి. ఒకశ్రేణితర్వాత ఒకటి బాణాలపంక్తి సువ్వునవచ్చి వజ్రపాతాలులా శత్రుసైనికుల, ఆశ్వికుల, గజవీరుల తాకినవి. కదలి వస్తున్నందువలన పులమావి సైన్యాల బాణాలనే ఇక్ష్వాకు బలగాలు చెక్కుచెమర్ప వయ్యెను.

పులమావి సైన్యాలవీరులు వేలకొలది కూలిపోసాగినారు. పులమావి సైనికులు ఇన్నాళ్లు యుద్ధాలు చేయకుండా నెగ్గివచ్చినందున యుద్ధం చేయ గల మేటి సేనాపతుల, సేనల ఉధృతం ఇప్పటికే చవిచూడసాగెను వేల కొలది పడిపోతూంటే, పులమావి సైన్యాలను ముందుకు నడుపుతూనే ఉన్నారాతని సేనాపతులు. కాని యుద్ధం వివాహయాత్రగా భావించిన అతని సైనికులు చటుక్కున ఆగిపోయారు. ఇక్ష్వాకుల బాణపాతం గురితప్పని మహావేగంలో వస్తూనే ఉంది. పులమావి సైన్యాలలో చికాకు ఎక్కువైంది. భయం మొలకెత్తింది, అది వృక్షమయింది. పులమావి సైన్యాలు వెనక్కు తిరిగాయి. చిందర వందరయి సైన్యాలు మహావేగంతో తమ శిబిరాలున్న స్థలానికి పరుగులు పెట్టాయి. ఆ గడబిడ, అల్లరి, ఆ త్రొక్కులాటలచే భూకంపం వచ్చిన వెనక ఒక నగరం ఉన్నట్లున్నదా ప్రదేశం. కాని పులమావి సైన్యాలను ఇక్ష్వాకు సైన్యాలు తరుముకుని రావటంలేదు.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 6

135

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)