పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయపురకోట శ్రీ బోధిసత్వనాగార్జునులచే నిర్మితమయినది. మానవ దుర్భేద్యమంటారు పెద్దలు. అలాంటి వారిని పైకి కొనిరావటమే యుద్ధనీతి అని నా విన్నపం.

“విజయ శాతవాహనునకు బావమరది అవడంవల్ల ధాన్యకటకానికి సహాయంగా వచ్చి తీరుతాడు శాంతిమూలుడని నీ ఊహ. అతడు రాక ఏ బ్రహ్మదత్తునో పంపితే?”

“ధాన్యకటకం కబళించి పూంగీప్రోలు ముట్టడిస్తాముగాక మహాప్రభూ!”

“బాగుంది మీ ఆలోచన మహాసేనాపతీ! శిబిరాలు ఎత్తించి మహావేగంతో ధాన్యకటకం దారి పట్టించండి.”

ఇంతట్లో ఒక సేనాపతి లోనికిరా అనుజ్ఞవేడినాడు. రావచ్చునని పులమావి కంచుకితో చెప్పినాడు. వెంటనే ఆ సేనాపతి లోనికి విచ్చేసి పులమావికీ మహాసేనాపతికి నమస్కరించి “అన్నదాతా! విజయపురం సైన్యాలు మనకు నాలుగు గోరుతాల (గోరుతము ఇప్పటి రెండుమైళ్ళు) దూరంలో ఉన్నాయని అపసర్పులవార్త. ఆ సైన్యాలు మహావేగంగా వస్తున్నాయట” అని కొంచెం వేగంగా మనవిచేశాడు.

పులమావీ, మహాసేనాపతీ ఒకరి మొగము ఒకరు చూసుకున్నారు. పులమావి వెంటనే “మహాసేనాపతీ, మన శిబిరాలు వ్యూహ రూపంగానే తీర్చి ఉన్నవి గనుక వెంటనే అర్థచంద్రవ్యూహం రచించండి. లిప్తలలోపని జరగాలి.” ఆ మాటలంటూ పులమావి కవచాదులు ధరింప లోనిశిబిరాలలోనికి పోయినాడు. మహాసేనాపతి తన శిబిరాలకు పోయి రణభేరీ వేయించి సేనలకు యుద్ధాజ్ఞలు ఆశ్వికవార్తాహరులచే అందింపచేయించెను.

రణభేరీలు, కాహళాలు నినాదాలు సంధానచేస్తున్నవి. సైనికులు, ఆశ్వికులు, రథికులు, గజయుద్ధవీరులు అతి వేగంగా తమతమ కవచాయుధాదుల ధరించి యధాస్థానాలకు పోతున్నారు. సైన్యం అంతా తెల్లవారేసరికి అర్థ చంద్రాకృతిలో సిద్ధమైయున్నది. పులమావి తన మహాగజము అధివసించి అర్ధచంద్ర మధ్యస్థుడైనాడు. మహాసేనాపతి దక్షిణ శృంగాన, ఉపమహా సేనాపతి నామ శృంగాననిలిచిరి. ఎదుట రెండు గోరుతాల దూరంలో త్రిశూల ప్యూహరూపంలో ఇక్ష్వాకుసైన్యాలు నిలిచిఉన్నాయి.

బ్రహ్మదత్త ప్రభువు దక్షిణదళాధిపతిగా తన రథం మీదనిలిచి ఉన్నాడు. యుద్ధ ప్రారంభముహూర్తం ఇంకా రెండు \ఘడియలున్నది. పులమావికియుద్ధ ప్రారంభ ముహూర్తం ఒకఘడియా ఇరువదివిఘడియలు మాత్రమే ఉన్నది. తన మూహూర్తానికి సరీగా పులమావి సైన్యాన్ని ముందుకు సాగించాడు. పులమావి సైన్యాలు నెమ్మదిగా ముందుకు పోతున్నాయి. సైన్యం ఒక ఘడియకు పావుగోరుతము దూరంసాగింది. ఇంకా ముందుకుపోతున్నది. అంతకన్న అంతకన్న వేగం ఎక్కువైంది. ఎదుటసైన్యాన్ని తాకి చుట్టుముట్టవలసిందని పులమావి తన సేనాపతులకు ఆజ్ఞలు పంపినాడు. ఆ వేగం నూరు ధనువుల (ఇప్పటి ఆరడుగుల పొడవు) చొప్పున కొంచెం కొంచెం ఎక్కువవుతున్నది. సైన్యంలో భేరీలు, కాహళాలు తమ తమ ధ్వనులు వేగం వేగం చేస్తున్నవి.

ఇంతలో ఇక్ష్వాకు సైన్యాలు కదిలే శుభముహూర్తం వచ్చింది. ఒక్కసారిగా శుభవాద్యాలు మ్రోగినవి. ఇక్ష్వాకు సైన్యాలు మూడు ధనువులు మాత్రం ముందుకు నడవాలి. అక్కడ సైన్యమంతా ఆగవలెను. ముందు శ్రేణివారు కూర్చుండి బాణాలు

అడివి బాపిరాజు రచనలు - 6

134

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)