పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణితో మాట్లాడి, తమలో తాము వేళాకోళాలాడి, చెలికత్తెల నాట్యాదికాలు, ప్రదర్శనాలు చూచి, తాము ఆనందించి మహారాజుకూ మహారాణికీ నమస్కరించి వెళ్ళిపోయేవారు.

వీణాగానం, నృత్యప్రదర్శనం అయిన తర్వాత అందరూ భోజనాలకు లేచినారు. అందరూ మేనత్త మేనమామ బిడ్డలే. భోజనగృహంలో అందరూ స్వర్ణపీఠికలపై కూర్చున్నారు. బంగారు కంచాలలో, బంగారు గిన్నెలలో అనేక విధాలైన శాకాలు, పచ్చళ్ళు, పప్పులు, పులుసులు, చిత్రాన్నాలు, ఆవూపాలు వడ్డనచేయు బాలికలు వడ్డించినారు.

వీరపురుషదత్తుడు పూంగీయ శాంతశ్రీని ఆ ఉదయం చూచినప్పటి నుండియు తన మనస్సు ఆనందపూర్ణముకాగా మాటలాడలేకపోయినాడు. ఆమె వైపు ప్రణయ పూర్ణములైన చూపులను పరసి, అంతలో మరల్చుకొన్నాడు. పూంగీయశాంతశ్రీ ఏమీ మాటలాడలేదు. దివ్య రేఖాసమన్వితుడు, బంగారుఛాయచే జగత్ప్రసిద్ధ సుందరాకారుడైన, తన ప్రియుని చూచి, అతని చూపులలోని బాధ నర్థము చేసికొన్నది. ఆమె కన్నుల నీరు తిరిగినది. ఇద్దరి హృదయాలూ పూర్ణమై యుండుటచేత ఇద్దరు ఈ సాయంకాలం శాంతిశ్రీ భవనానికి వచ్చినా పలుకరించుకోలేదు. ఇదంతా బాపిశ్రీ అర్థం చేసుకొంది. తన అక్క రాజకుమారుని ఎంత ప్రేమిస్తోందో, తానూ అంతే ప్రేమిస్తోంది. అయినా తానూ శాంతా జీవికాజీవు లవడంచేత ఒకరిమీద ఒకరికి ఓర్వలేనితనంలేదు.

వీరపురుషదత్తుడు బాపిశ్రీని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమెలో పూంగీయశాంతను చూస్తాడు. ఇంతలేని బాపిశ్రీ అతనికి కనపడదు. బాపిశ్రీ లేని శాంత అతనికి తోచదు.

ఇక్ష్వాకు రాజకుమారిక ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నించుకొంటుంది. స్త్రీ పురుషుల కలయిక ఒక యజ్ఞంవంటి ధర్మకార్యమని ఆమె ఉద్దేశం. సంతానం కనడం భూమిలోనుంచి మొక్కలు ఉద్భవించడం వంటిది. గ్రంథాలలో తెలుపు ప్రేమానుభవం ఏలాంటిదో ఆమెకు అర్థం కాలేదు. తన మేనయత్తల కొమరితలు ఇద్దరూ తన అన్నగిరియందు తమకున్న ప్రేమను వర్ణించి చెప్పుకొన్నారు. ఈనాడు తనలో ఏదో వర్ణింపరాని ఉత్సాహం కలిగింది. ఏదో ఒక విచిత్ర సంతోషం కలిగింది. తానే తన ఉత్సాహానికి ఆశ్చర్యం పొందింది. తాను ఎందుకు బ్రహ్మదత్తుని ఎదుర్కొనడానికి వెడతానన్నదో, తానెందుకు పాదచారిణియై బ్రహ్మదత్తుని కడకు నడిచి వెళ్ళిందో? అలా వెళ్ళడంలో ఏదో అనందం అనుభవించింది. ఎందుకు తానా పనులుచేసిందో? ఎందుకు తన వదినగారిని భోజనానికి పిలిచిందో?

అన్నగారు మేనత్త కొమరిత శాంతను వనదేవతగా వరించక పోవడంవల్ల ఆమెకు కోపం వచ్చి పూంగీప్రోలు వెళ్ళిపోయిందనీ, తానీఏటి వసంతోత్సవాలకు పూంగీరాజ కుటుంబాన్ని ఆహ్వానించడానికి పూంగీప్రోలు వెళ్లు తున్నాననీ బ్రహ్మదత్తప్రభువు వెళ్ళిపోతూ తెలపడంవల్ల ఆమె విన్నది. కోపమంటే? ఒక మనుష్యునికి కోపం ఎందుకు? నేడు వీరంతా తన ఇంటికి విందుకు వచ్చినప్పుడు పూర్వస్నేహముతో మెలిగి సంతోషంగా ఉంటారని ఆమె కేలా తోచినదో? జరుపవలసిన తంతులన్నియు అంతఃపుర పాలకురాలు జరుపుతున్నది.

అడివి బాపిరాజు రచనలు - 6

122

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)