పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజనాలయి తాంబూలాలు వేసుకొన్నారు. విష్ణుశ్రీకుమారుడు వెళ్ళిపోయినాడు. అప్పుడు ఇక్ష్వాకు శాంతిశ్రీ కుమారి తన అన్నగారి చేతికి మల్లెపూలదండలు ఇచ్చి “అన్నగారూ! ఇది వదినగారల ముగ్గురితలలలోనూ ముడవండి” అన్నది. ఆమె మోములో, కన్నులలో హాస్య కాంతిలేదు. శాంతికాంతులు మాత్రము వికసిల్లి ఉన్నవి.

4

పులమావి వసంతోత్సవదినాన తన సర్వసైన్యాలను నడుపుకుంటూ వైజయంతిపురం వెళ్ళినాడు. వైజయంతి చూటుకుల శాతకర్ణులు పులమావి సైన్యాలతో వస్తాడని అనుకోలేదు. ప్రస్తుతము పులమావికి లోబడడమే ఉత్తమమనుకొని, చూటుకుల విష్ణుస్కంద మహారాజు, పులమావిని చక్రవర్తిగా ఆహ్వానించి కప్పములుగట్టి, యుద్ధయాత్రకు తనవంతు ఖర్చునిచ్చి, ఆయనకు వీడుకో లిచ్చెను.

పులమావి చక్రవర్తిగా ఆభిషేకించుకొన్నాడని వినగానే విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి మిన్నుముట్టిన కోపం వచ్చింది. వెంటనే తన బావగారు ఇక్ష్వాకు శాంతిమూల మహారాజుకు "ఏమిటి కర్తవ్యం?” అని వార్త పంపినాడు. ఆ వెంటనే పులమావి కడనుండి విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి శ్రీముఖం వచ్చింది. “నీకు రాజ్యార్హతలేదు. అన్యాయంగా యజ్ఞశ్రీ చక్రవర్తి అయినాడు. అయినా తన చక్రవర్తిత్వము తాను కాపాడుకోగలిగాడు. నువ్వు నీరుసుడవు, త్రాగుబోతువు. నీకు అంతఃపుర స్త్రీలను ఏలుకోవడం తెలుసును. నువ్వు మన్మథ సామ్రాజ్యానికి తగుదువు. దిగు సింహపీఠం! భక్తితోవచ్చి శ్రీశ్రీ హారీతిపుత్ర పులమావి శాతవాహనస్వామి పాదాలబడితే నిన్ను సామంతునిగా ఉండనిస్తారు. లేకపోతే నువ్వు రాజద్రోహివి అవుతావు.” ఈ విధంగా ఉంది ఆ శ్రీముఖం. విజయశ్రీ శాతవాహన చక్రవర్తి భయముచేతా, కోపంచేతా గజగజవణికిపోయినారు. ఆ శ్రీముఖాన్ని ఇత్తడి మందసంలో పెట్టి బంధించి, దానిని శాంతిమూల మహారాజుకు పంపినాడు.

ఇంతలో పులమావి వేయి ఏనుగులతో, ఇరవైవేల ఆశ్వికబలంతో, ఆరువేల రథాలతో, ఒక అక్షౌహిణి (లక్షా ఇరువదివేలు) కాల్బంతో బయలు దేరినాడని వార్త రాగానే విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి గుండెల్లో రాయిపడింది. తన సేనాపతులకు సేనలన్నీ సిద్ధంచేయండని అజ్జలిచ్చినాడు. మహాభోజులకు, మహారథులకు, అభీరులకు పులమావిని ఎదుర్కొని బందీ చేయండని ఆజ్ఞలు పంపినాడు. తమ తమ సేనలతో ధాన్య కటకానికి రండని, మాఠరులకు, వాసిష్టులకు సాలంకాయనులకు, బృహత్పాలాయనులకు, ధనకులకు, పూంగీయులకు, బెళుకురాయనకులకు (చాళుక్యులకు), చూటుకులులకు, ఇక్ష్వాకులకు రాజాజ్ఞలు పంపినాడు. ఇంతలో వైజయంతీ శాతకర్ణులను ఓడించి పశ్చిమతీరాన్నే అభీరులపైకి పులమావి వెడుతున్నాడని వార్త వచ్చింది విజయశ్రీ చక్రవర్తికి.

శాతవాహనుల సైన్యాలు తప్ప ఇక ఏ సైన్యాలూ రాలేదు. విజయపురంలో ప్రతిసంవత్సరంకన్న ఈ ఏడు ఎక్కువ వైభవంగా వసంతోత్సవాలు జరుపుతున్నారు. అందుకని ఉత్సవాలు పూర్తికాగానే సైన్యాలతో వస్తున్నానని శాంతిమూలుడు చక్రవర్తికి వినతి పంపినాడు. విజయశ్రీ శాతవాహనునకు కోపం మిన్నుముట్టింది. తన రాజ్యానికి

అడివి బాపిరాజు రచనలు - 6

123

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)