పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏ వార్త వచ్చినా గ్రామభేరీ నివాదవార్తా విధానంవల్ల ఉదయం ప్రారంభిస్తే, సాయంకాలానికి మూలమూలలగ్రామాలకు కూడా ఆ వార్త ప్రాకిపోతుంది. బ్రహ్మదత్త ప్రభువు క్షేమంగా పూంగీప్రోలు చేరారన్న వార్త అంతట అల్లుకోగానే దేశం అంతా సంతోషంతో పొంగిపోయింది. మహారాజు దేశంలోని బాలబాలికలకు పళ్ళూ, బట్టలూ పంచి ఇవ్వవలసిందని మంత్రులకు ఆజ్ఞనిచ్చారు. దేశం అంతా మూడురోజులు మహోత్సవాలు చేసుకున్నారు.

బ్రహ్మదత్తప్రభువు విజయపుర పర్వతగోపురం దగ్గిరకు వస్తున్నాడని ప్రభువునకు వార్తాహరులు చెప్పినారు. ఆ ప్రభువును ఎదుర్కొనేందుకు మహారాజు స్వయంగా యువరాజుతో, మంత్రులతో, సేనాపతులతో బయలు దేరినాడు. అప్పుడు శాంతిశ్రీ రాజకుమారి అంతఃపురంనుంచి తన గురువును ఎదుర్కొనేందుకు తండ్రిగారి అనుమతి వేడెను. మహారాజు సంతోషంతో ఒప్పుకొన్నారు. రాజకుమారి మూర్తి పొందిన సౌందర్యమువలె రథమును అధివసించి, చెలులు కొలువ తండ్రిగారి రాజభవనద్వారమువద్ద కలుసుకొన్నది.

భిక్షువులు, పండితులు, రథికులూ కొలువ మహారాజు శుభవాద్య పురస్కృతుడై తూరుపు గోపురంవద్దకు వెళ్ళినారు. ఆ పర్వతగోపురద్వారం ప్రజలతో నిండిపోయింది. వారందరూ ఆ గోపురద్వారం దాటి ఆ పర్వతరాజ పథము వెంటనే ఒక అర్థగోరుతదూరం ముందుకు సాగిపోయినారు. ఇంతలో ఎట్టఎదుట ఆ మహారాజపథముపై ఒక మహా సైన్యము వస్తూ కనబడినది. శాంతిమూలమహారాజు తన వారిని ఆగుడని కోరగనే ఆ ప్రదేశం అంతా గుట్టలు, లోయలు, చరియలు, ఘనశిలలు, వృక్షాలు ప్రజలతో నిండిపోయాయి.

ఇంతలో బ్రహ్మదత్తుడు, మహారాజు పూంగీయ స్కందశ్రీ ప్రభువు, పూంగీయ యువరాజు స్కందసాగరాయనక ప్రభువుతో రథములపై వస్తూ ఏనుగు నధివసించియున్న శాంతిమూలమహారాజుకు కనిపించినాడు.

3

ఇక్ష్వాకు శాంతిశ్రీరాకుమారి, పూంగీయ శాంతశ్రీ రాకుమారికను, పల్లవ రాణి అయిన హారీతి బ్రహ్మశ్రీ హమ్మశ్రీదేవి కొమరితలు బాపిశ్రీ, షష్ఠశ్రీ రాకుమారికలను, అన్నగారయిన వీరపురుషదత్తుని, పూంగీయ ద్వితీయరాజ్ఞీ కుమార విష్ణుశ్రీ రాజకుమారుని బ్రహ్మదత్తప్రభువు వచ్చిన దినానే విందుకు పిలిచింది. రాజకుమారి ఇంతవరకు తన భవనానికి బంధువులను విందుకు పిలవడం ఎరగనే ఎరగదు. ఆమె పేరిటనే తల్లిదండ్రులే చుట్టాలను విందులకు పిలుస్తూ ఉండడమూ, తాముకూడా ఆ విందులకు రావడమూ జరిగేది. అలా జరిగిన విందు సమయాల్లో ఇక్ష్వాకురాజకుమారి అంటీముట్టనట్లు ఊరకుండేది. ఎవరన్నా పలకరిస్తే ప్రతివచనం ఇచ్చేది లేకపోతే తన విశాలమైన కళ్ళల్లో శైశవ దృక్కులు వికాసిస్తూ ఉండగా చూస్తూ కూర్చుండేది. వచ్చిన చుట్టాలు మహారాజుతో

అడివి బాపిరాజు రచనలు - 6

121

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)