పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చి చక్రవర్తి పాదాలకడ సాష్టాంగపడి తమ తమ కప్పాలను అర్పించవలసి ఉంటుందని ఆ శ్రీముఖంలో ఉన్నది.

శాంతిమూలుని కోపం మరీ మిన్ను ముట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. పులమావి చక్రవర్తి ఒకసారి విజయపురంలో ఇక్ష్వాకు శాంతిమూలుని తనయ శాంతిశ్రీ రాకుమారిని చూచినారట. ఆ బాలిక తమకు తగిన పట్టమహిషి అని సార్వభౌముల దివ్య చిత్తానికి తోచినదట కాబట్టి ఇక్ష్వాకు శాంతిమూల ప్రభువు చక్రవర్తికి మామగారయ్యే అదృష్టాన్ని పొగడుకొంటూ తన కొమరితను కొనివచ్చి చక్రవర్తికి అర్పించవలసినది. ఇది సార్వభౌముల ఆజ్ఞ అని శాంతిమూల మహారాజునకు వచ్చిన శ్రీముఖంలో ఉంది.

శాంతహృదయుడు నిర్వికారుడు, అతిరథశ్రేష్ఠుడు అగు శ్రీ శాంతిమూలునకు రాజలేఖకుడు ఆ శ్రీముఖం చదివి వినిపించడంతో ఒక్కసారి పాలపొంగులా కోపం వచ్చింది. ఇంతలో మహాసభాప్రాంగణంలో శుభ కేతనధారియై పూంగీప్రోలునుండి వార్తాహరుడు వచ్చి దర్శనానికి అనుమతి వేడుకొంటున్నాడు అని ప్రతీహారి మనవి చేసినాడు.

మహారాజుకు కోపమంతా ఒక్కసారి చల్లారిపోయింది. అతి సంతోషంతో వెంటనే కొనిరావలసిందని ఆజ్ఞ యిచ్చినారు. ఆ వార్తాహరుడు వచ్చి మహారాజు అధివసించి ఉన్న సింహాసనం ఎదుట మోకరించి, లేచి, చేతులు జోడించి, “జయము జయము సార్వభౌములకు శ్రీ శ్రీ ధనకమహారాజు మహాసేనాపతి, మహాతలవరి, మహాదండనాయక, అడవిస్కంద విశాఖాయనక బ్రహ్మదత్తప్రభువులు తమకు వారి నమస్కృతులు సమర్పించు కొంటున్నారు. వారు సువర్ణదీవి దర్శించి, అక్కడ మహారాజులకు అతిథియై, ఆ ద్వీపంలోని శ్రీ తధాగత చైత్యాలను దర్శించి, నౌకను సురక్షితంగా నడుపుకొంటూ ఈ ఉదయమే పూంగీప్రోలు చేరినారు. అక్కడ మా ప్రభువులు సురక్షితంగా చేరినందుకు పూంగీయ మహారాజులు స్కందశ్రీ ప్రభువు సలుపదలచిన మూడుదినాల ఉత్సవాలకూ ఆగి, ఆ వెంటనే హుటాహుటి బయలుదేరివచ్చి తమ పాదాల సన్నిధిని ఉందుము” అని మనవి చేయు మన్నారు. జయము! జయము! అని మనవి చేసివాడు. శాంతిమూల మహారాజు ఆ వార్తాహరునకు తమ మెడలోని హారము బహుమతిగా ఇచ్చిరి.

బ్రహ్మదత్తుడు సురక్షితంగా తిరిగివచ్చినందుకు దేశం అంతటా ఉత్సవాలు చేయ రాజాజ్ఞలు వెళ్ళినవి. ప్రజలకు బ్రహ్మదత్తుడంటే అమితానురాగం. ఆ యువక ప్రభువు ప్రజలకై ఎన్నియో మహత్తర కార్యములు చేయించినాడు. చిన్న చిన్న ఏరులకు అడ్డగట్లు వేయించి, పెద్దపెద్ద చెరువులు నిర్మించాడు. గ్రామాదులలో మంచి నూతులు తవ్వించి తీయనిజలాలు సర్వకాలాలు అందరికీ అందునట్లు చేసినాడు. గ్రామగ్రామానికీ చక్కని రాజబాటలు నిర్మించినాడు. అనేక గ్రామాలలో సత్రములు, దారిపొడుగునా చలివేంద్రాలు, వైద్యశాలలు నిర్మించాడు. వైద్యులకు రాజస్వము లేర్పాటుచేసి హిమాలయ ఓషధులు అందునట్లు చూచినాడు. కర్షకులకు మంచివిత్తనాలు అందుబాటు చేయించి, కరవు ఎప్పుడన్నావస్తే ధాన్యాదులు బ్రజలకు విరివిగా పంచిపెట్టేవాడు. బ్రహ్మదత్తుడు తన సామంతరాజ్యంలోనూ, ఇక్ష్వాకు మహారాజ్యంలోనూ ఉన్న వేలకొలది గ్రామాలన్నీ తిరిగి ప్రజల క్షేమాదులు కనుక్కుంటూ ఉండేవారు. దేశం అంతటా విద్యాశ్రమాలు నిండి పోయాయి. ప్రతి గ్రామంలోను చిన్న బిడ్డలకు విద్యగరిపే బడులు ఏర్పాటయ్యాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

120

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)