పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనలక్ష్మి.

277

శోకింపుచు నేమియుఁ దినక, త్రాగక తదేకధ్యానముతో నుండెను. ఇంతలో నాగ్రామములోని పోలీసుబంట్రోతు జరిగిన వర్తమానమును వ్రాసికొనుటకై ధనలక్ష్మియున్న గృహమునకు వచ్చితానే ధనలక్ష్మిని సముద్రములోనుండి తీసినట్టు కైఫియత్తువ్రాసి యిమ్మనెను. కాని నీతివిశారదయైన ధనలక్ష్మి యసత్యమాడక బెస్తవాఁడు తనను రక్షించెనని నిజమయిన సమాచారమును వ్రాసియిచ్చెను. ఇంతలో నామెకు భర్త బ్రతికివచ్చు చున్నాఁడని పోలీసువారివలన వర్తమానము తెలిసి యపరిమితానంద భరితయై యామెభర్త నెదుర్కొనఁ బోవునంతలో నతఁడే గృహమునకు వచ్చెను. అప్పుడా యిరువురును పరస్పర సందర్శనములవలన మితిలేని యానందము గలవారలైరి. ధనలక్ష్మి పతికి నమస్కరింపఁగా నతఁ డామెనెత్తి యాలింగనము చేసికొని యామె సముద్రమునం దగుపఱచిన దైర్యమునకును, ఆమె తనప్రాణములకుఁ దెగించియైనను దమ యిరువురి ప్రాణములను గాపాడినందునకును నామెను బహువిధముల సుతియించెను. అంత వారందఱును భోజనములను జేసిరి. ఈవార్త యాగ్రామమంతటను దెలియఁగా బ్రజలు మూఁకలుగట్టి వచ్చి ధనలక్ష్మినింగని నమస్కరించి కేవలము లక్ష్మిదేవినిగా భావించి స్తుతియించిరి. అప్పు డామె వారితో మీరు నన్నేల స్తుతియించెదరు? సర్వరక్షకుఁడగు జగదీశ్వరుని స్తుతియించినఁ గృతార్థులయ్యెదరు; అని వారిలో స్త్రీలకుఁ బతివ్రతా ధర్మములను గూర్చికొంతయుపన్యసించెను. ఆమఱునాఁడు వారు స్వగ్రామమునకుఁ బోయిరి. వీరచటికరిగి జరిగిన వర్తమానమునంతను చెప్పఁగా విని ధనలక్ష్మి యత్త మామ