పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

అబలాసచ్చరిత్ర రత్నమాల.

అందుకు ధనలక్ష్మి 'నాయనా నేనెప్పుడు నధైర్యపడను. నా కీదుట బాగుగాఁ దెలియునుగాని చాలదూరమునుండి యీదుచు వచ్చుటవలన మిక్కిలి బలహీననైతిని. నీవు నాకీదుటలో సహాయము చేయుము' అని యడిగెను. అప్పు డాబెస్త యామె చేతనున్న కట్టెను ముందుకుఁ ద్రోసికొని పోవుటలో నామెకు సహాయుఁడై యామెను రేవుకుఁ జేర్చెను. ధనలక్ష్మివలన జరిగిన సంగతిని విని విశ్వనాధుఁడు మిగుల శోకాకులమానసుఁడయి యామె నొక విప్రుని గృహమున కనిచి తాను దివిటీలను వేయించుకొని సముద్రము నొడ్డున నంతను వెదకఁ బోయెను.

ధనలక్ష్మియు నావిప్ర గృహమునకరిగి తనపతి బ్రతికి వచ్చిన జాడఁ గానక నతఁడాసముద్రమున మునిఁగి ప్రాణములను విడిచెనని తలఁచి తాను బ్రతికివచ్చినందునకై మిగుల దు:ఖింపసాగెను. అప్పుడచటి వారందఱును ఆమెను గని 'తల్లీ! నీవు నడిసముద్రమునం బడియైనను ధైర్యమును విడువక యిరువురి ప్రాణముల సంరంక్షించు నీవు ప్రాణములతో నిచటికి వచ్చితివి. నీయద్వితీయధైర్యము నేమనవచ్చును? ఇట్లయ్యును నీవిపుడు ధైర్యమును విడుచుట యుక్తముగాదు. నీ కిప్పుడన్నియు శుభసూచకములే కానుపించుచున్నవి. నీ వింత సేపు సముద్రములో నీదివచ్చినను నీ నుదుటి[1] కుంకుము చెరగ లేదు. కాన నీసౌభాగ్యము శాశ్వతముగా నుండును అని ధైర్యము చెప్పిరి. కాని యాపతివ్రత భర్తపై మనసునుంచి

  1. కొందఱు స్త్రీలు నుదుటికి మైనము రాచి దానిపై కుంకుము పెట్టుకొనెదరు. అది నీటితోనైనను చెరగదు.