పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనలక్ష్మి.

275

ధైర్య మవలంబించి యా కట్టెను త్రోసికొనుచు రేవునకు నర క్రోసు దూరమువఱకు వచ్చెను. అప్పుడు సూర్యుఁడు పశ్చిమాద్రిపయి నస్తమింపు చుండెను. ఆసమయమున విశ్వనాధుఁడు వియ్యాలవారిని నోడలోనుండి దింపి తనగ్రామమునకుఁ గొనిపోవుటకై బండ్లనుదీసికొని యా రేవునకు వచ్చియుండెను. అప్పుడచటఁ దమతమబండ్లను గడుగు బండ్లవాండ్లును, సముద్రమునందలి యోడలలో సరకుల నెక్కించువారును, వచ్చిన సరకులను దించువారునునుండి రేవు మిగుల కోలాహలముగా నుండెను. ధనలక్ష్మికి రేవు కాన వచ్చినందున నచటిజనుల వైపునకుఁజూచి కేక వేసి చెయ్యివిసిరి సైఁగచేసెను. కాని యచటికి రేవరక్రోసెడు దూరముండినందున నచటిజనుల కీమె సైఁగ కానుపింపదయ్యె. తదనంతర మామె తనరెండు చేతుల నెత్తి సైఁగచేయఁగా నచటనున్న బండివాఁ డొకఁడు చూచి యొకమనుష్యుఁడు సముద్రములోఁ గొట్టుకొనివచ్చుచున్నాఁడని యతఁడచటి బెస్తలతోఁ జెప్పెను. కాని యపుడు తుపాను సమయమై సముద్ర మల్లలల్లోలముగా నున్నందున సాహసించి సముద్రములోనికిఁ బోవుట కెవ్వరు నొప్పకుండిరి. ఇంతలోఁ బాటుసమయమైనందున ధనలక్ష్మిని సముద్రము మరల వెనుకకుద్రోయఁ జొచ్చెను. అప్పు డామె యీదుటకు శక్తిచాలక ప్రాణములపై నాశను విడిచి పరమేశ్వరుని స్మరణ చేయుచుండెను. అది చూచి యొక బెస్త మిగుల దయ గలవాఁడయి పుట్టగోచిని బిగించి సముద్రములోనం దుమికి యీదుచు నామెను సమీపించి 'యమ్మా నిన్ను నేను రక్షింప వచ్చితిని; నీవు ధైర్యము విడువకుమ'ని యామెతో ననెను.