పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

అబలాసచ్చరిత్ర రత్నమాల.

యును" అని యుత్తరము వ్రాసియంపి రాజును పట్టణములో నుండి కిల్లాలోనికిఁబిలిపించి యిట్లు తిరస్కారోక్తులం బల్కెను. "ఓరీ! నీవు శివాజీవంశీకుఁడవుకావు. నేను నామనుమనిని హీనులయింట దాఁచితిని. కాని వారు నాపిల్లని నుంచుకొని తమపిల్లని నే నాకిచ్చిరి కాఁబోలును. నేనది విచారింపక నిన్నింతటి పదవికి నెక్కించి మిగుల వ్యసన పడవలసినదాన నయితిని. హీనకులుని శివాజీవంశస్థునిగాఁ జేసిన పాపమున కిఁక నేను కృష్ణాతీరమునకునరిగి ప్రాయశ్చిత్తముచేసికొనవలయును" ఇట్లని యామె రాజును వెంటనే కారాగృహవాసినిఁ జేసెను. పిమ్మట నాయువతికిల్లా యధికారినిఁబిలిచి రాజుసహచరులపైని, గ్రామములోఁగ, కోకణస్థబ్రాహ్మణ (పేష్వా) పక్షపాతులకు వారిగృహములపైని పిరంగిగుండ్లనువేసి నిర్మూలము చేయుమని యాజ్ఞాపించెను. ఈవార్త నాపురమునంగల కొందఱు పేష్వాపక్షము వారు విని ఈముసలమ్మకు మతిచెదిరి యేదియో యనుచుండునని తలఁచిరి. కాని సైన్య సహితుఁడయి గాయికివాడ్ వచ్చుటను విని వారందఱును కొంతసైన్యము సిద్ధపఱచి కృష్ణాతీరమునందుండిన పారోళేయను గ్రామమునందు యుద్ధ సన్నద్ధులై యుండిరి. దమాజీగాయకవాడ్ పదునైదువేలసైన్యముతోఁ బారోళేయను గ్రామమును సమీపించెను. అప్పుడా యుభయసైన్యములకుఁ గొంతకలహము జరిగినపిమ్మట దమాజీ ప్రతిపక్షబలంబుల నోడించి సాతారాలోనికిఁ బ్రవేశించెను. ఈయనపోయి తారాబాయినిం గలిసిన వెంటనే యీమె సాతారాసమీపమునందలి రెండుమూడు దుర్గములను వశపఱచుకొనియెను. ప్రతినిధి తారాబాయి కనుకూలుఁడగుటవిని పేష్వా