పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారాబాయి.

191

బహుత్వరగా సాతారాకు రావలసినవాఁ డయ్యెను. పేష్వా సాతారాను సమీపించి దామాజీ గాయికవాఁడను ఓడించి యతనిని బంధించి పూనాకుఁబంపెను. తదనంతరము తారాబాయితనకు వశపడుటకై పేష్వా పెక్కు పాయములను బన్నెను. కాని యా స్వాభిమానముగల వనిత యెంతకును స్వాధీనపడకుండెను. సరదార్లంద ఱామె కనుకూలురై యుండినందున బలాత్కారముగా నామె నీవలకుఁదీయుట యుచితముగాదని పేష్వాకుఁ దెలిసియుండెను. అందువలన నతఁడు మరాఠీ వాని (సాతారాకోలాపురపు) రాజ్యములలోని కనేక పర్యాయములు బందిపోట్ల నంపి గ్రామములు కొల్లగొట్టించి తారాబాయిని, కోలాపురాధిపతియగు సంభాజీని వశపఱచుకొనెను.

పేష్వా గాజీయుద్ధీనుపనికొఱకు ఔరంగబాదున కరుగఁగా నా సమయమున తారాబాయి అయిదువేలసైన్యమును పోగుచేసివాయి, సాతారాలను రెండుపరగణాలను తన స్వాధీనము చేసికొనెను. పిమ్మట బాలాజీ పేష్వాపూనాకువచ్చి కర్ణాటకముపైకి దండువెడలుటకంటెను తారాబాయిచేఁ జిక్కిన కోటలను గెలుచుట యావశ్యకమని తలఁచెను. అంత నతఁడు సాతారాకు విశేషసైన్యములనంపి కిల్లాలోనికి నన్నసామగ్రి పోవకుండ నాపెను. అప్పు డచటి దుర్గాధిపతి యుద్ధము చేసినందున ఫలము లేదనుకొని రాజును తారాబాయియొక్క కిల్లాబైటికిఁ దీసికొనిపోవయత్నించెను. ఈసంగతి యేలాగుననో తారాబాయికిఁ దెలిసి వెంటనే యతనిని మరణదండనకు గురిచేసెను. అంత పేష్వా తారాబాయిని గెలుచుట దుస్తరమని తలఁచి అప్పటి కాసంగతిని విడిచి కర్ణాటకముపై కరిగెను.