పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ర్యములకు నెట్లయిన విఘ్నములు గావింపవలయునని తలఁపు గల ధర్మాచరణపరాయణులు మనదేశమునం దున్నందుకు నెంతయుఁ జింతిల్లవలసియున్నది. అమేరికాలోనుండఁగా ఆనందీబాయి యనేకోపన్యాసముల నిచ్చి యచ్చటి విద్వాంసులను మెప్పించెను.

భార్యవెళ్లిన రెండుసంవత్సరములకు గోపాలరావుగారు బయలుదేఱి కాలినడకతో నమేరికా కరిగెను. ఆయన తనభార్య నడవడిని గనుఁగొనదలఁచి యామెకుఁ దెలుపకయే యకస్మాత్తుగా నచటికిఁబోయెను. కాని యామె సత్ప్రవర్తనఁ గనిన పిదప గోపాలరావు తానామెనుగూర్చి శంకించినందుకు పశ్చాత్తాపపడెను. ఇట్లు గొప్పవిద్య నేర్చుకొని అమేరికాదేశమునకుఁ జని, మహాగౌరవమును గాంచియు విశుద్ధచరితగా నుండి యెల్లప్పుడును సంశయముతోనే యుండెడిపతిని మెప్పెంచిన యీపతివ్రతాశిరోమణి పాత్రస్మరణీయ యనుటకు సందేహము లేదు.

నాలుగుసంవత్సరములు చదివినపిదప ఆనందీబాయి వైద్యవిద్యయందు ప్రవీణురాలని మెప్పు పొందెను. తదనంతర మాదంపతులు అచటఁ జూడఁదగిన స్థలములనుజూచి కార్పెంటరు దొరసానివద్ద సెలవుపుచ్చుకొని స్వదేశమునకు వచ్చిరి. ఆనందీబాయి అమేరికాలో నుండినకాలముననే కోలాపురపు సర్కారువా రామెను తమస్త్రీవైద్యశాల కధికారినిగా నుండుమనియు, నెలకు మూడువందలరూపాయిలు వేతనమిత్తు మనియుఁ బిదప నైదువందలవఱకు వృద్ధిపొందింపఁ గలమనియు నామెకుఁ దెలిపిరి. కాన నామె యందునకు నొప్పుకొనెను. కాని.