పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వముచేయుటకై, కవిత్వస్ఫూర్తిని వృద్ధిపరచుటకై, కొమార్తెను సదా ప్రోత్సాహ పరచుచుండెను. అందువలన దనకు గవిత్వశక్తి లభించి దృడపడినదని తోరూదత్తెల్లప్పుడును తండ్రిగారి యెడ మిగుల కృతజ్ఞురాలయియుండెను. ఇటులగదా తండ్రి తన పుత్రీపుత్రులను జ్ఞానవంతుల జేయవలసిన విధి. ఇటులగదా పుత్రీపుత్రులు తమ మాతాపితలయెడ గడుగృతజ్ఞులయి యుండవలసిన విధి.

ఇట్లు గోవిందచంద్రదత్తు తన కుమార్తెలకు విద్యాబుద్ధులు చెప్పించి, పుత్రులవలెనే పెంచుట చూచి కొందరాశ్చర్యపడుదురేమో. కాని, యట్లు ఆశ్చర్యపడుటకు గారణము లేదు. పుత్రికలను పుత్రులవలె జూచుటయే శాస్త్రధర్మము. కన్యావివాహ సమయమునందు దండ్రి 'పుత్రవత్పాలి తామయా' 'పుత్రునివలె నాచే బెంచబడిన కన్య' యని చెప్పుట సర్వప్రసిద్ధ మేకదా. ఇదియుగాక మునిశ్రేష్టుడైన మనువు పుత్రీపుత్రులు సమానమని స్పష్టముగా వ్రాసియున్నాడు.

   యధావాత్మా తధాపుత్ర: పుత్రేణ దుహితాసమా.

   "తనతో సమానుడు పుత్రుడు. పుత్రునితో సమానము కూతురు."

శాస్త్రము లిటుల నుద్ఘోషించుచుండాగా మన దేశమునందు బాలికలను బాలురకంటె నతినీచముగా జూచుటజూడ మిక్కిలి ఖేదకరముగా నుండక మానదు. ఆడుపిల్ల పుట్టిన నాటినుండియు దలిదండ్రులకు మిక్కిలి ఖేదకరముగా నుండక మానదు. ఆడుపిల్ల పుట్టిననాటినుండియు దలిదండ్రులు మిక్కిలి ఖేదముతో